పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. ఓ హత్య కేసులో తాజా పరిణామాలు ఆయన ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెడుతున్నాయి. ఏకంగా ఆయన పదవికే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండడం, ప్రజల నుంచి కూడా ఈ కేసు విషయంలో ఒత్తిడి పెరుగుతుండడం నితీశ్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ సీఎం నివాసానికి సమీపంలోనే హత్యకు గురికావడం బీహార్‌లో సంచలనం సృష్టించింది. సీఎం నివాసానికి దగ్గరలోనే ఇలాంటి ఘటనలు జరిగితే ఇక రాష్ట్రం పరిస్థితేంటని ప్రతి పక్షాలు మండిపడుతున్నాయి.

ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన మేనేజర్ రూపేశ్ సింగ్(44) మంగళవారం సాయంత్రం పాట్నాలోని తన ఇంటి గేటు ముందే అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఎవరో గుర్తు తెలియని ఆగంతకులు ఆయనపై కాల్పులు జరిపి హత్య చేశారు. రూపేశ్ సింగ్ ఆయన ఇంటి ముందు ఉండగానే ఈ దారుణం జరగడం, ఆ ఇల్లు కూడా ముఖ్యమంత్రి నివాసానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉండడ తాజాగా కలకలం సృష్టించింది.

 రోజూలానే ఆయన తన డ్యూటీ ముగించుకుని ఎస్‌యూవీలో ఇంటికి చేరుకున్నారు. అయితే గేటు మూసి ఉండడంతో హారన్ కొట్టి బయటే వేచి చూస్తున్నారు. ఇంతలోనే బైక్ మీద వచ్చిన ఇద్దరు యువకులు ఆయనపై కాల్పులు జరిపారు. దీనికి కొద్ది గంటల ముందు కోవిడ్ వ్యాక్సిన్ రావడంతో ఆయన పాట్నా విమానాశ్రయంలో కనిపించారు. రూపేష్ సింగ్‌ను ఎయిర్‌పోర్ట్ నుంచి హంతకులు వెంబడించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రూపేష్ హత్యకు వ్యక్తిగత శత్రుత్వం కారణమా..? లేక ఇంకా ఏదైనా కారణం ఉందా..? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పాట్నా పోలీసులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఘటనపై సీఎంఓ స్పందించింది. ఘటన తీవ్ర దిగ్భాంతి కరమని, విషయం తెలిసి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ షాక్ అయ్యారని, వెంటనే పోలీసులతో మాట్లాడి.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌కు కేసును అప్పగించారని సీఎంఓ కార్యాయలం నుంచి ఓ ప్రకటనలో వెలువడింది. ఈ ప్రకటన ప్రకారం.. దుండగులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని, విచారణ వేగవంతం చేసి బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ఇదిలా ఉంటే ఈ హత్యా ఘటనను ప్రతి పక్షాలు చక్కగా వినియోగించుకుంటున్నాయి. సీఎం చేతగాని తనం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ దాడులకు దిగాయి. విచిత్రమేమంటే తమ కూటమిలోని బీజేపీ ఎమ్మెల్యేలు సైతం ఈ ఘటన విషయంలో నితీశ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. మరి వీటికి నితీశ్ ఎలా సమాధానమిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: