ఇంటర్నెడ్ డెస్క్: తెలంగాణ పోలీసులకు మాజీ మంత్రి అఖిలప్రియ చుక్కలు చూపిస్తోంది. పోలీసుల సహనాన్ని పరీక్షిస్తోంది. అధికారులు అడిగే ఏ ప్రశ్నకూ సరైన సమాధానం చెప్పకుండా మొండి పట్టుతో మౌనం వహిస్తోంది. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ మూడో రోజు కస్టడీ నేడు(బుధవారం) ముగిసింది. విచారణలో ఆమెను పోలీసులు 300 వరకు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అయితే చాలా ప్రశ్నలకు అఖిలప్రియ మౌనంగానే ఉన్నారట. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేసిందట. అయితే ఈ విచారణలో అనేక కీలక విషయాలను ఇప్పటికే పోలీసుల చేతికి చిక్కినట్లు తెలుస్తోంది. అఖిలప్రియ నుంచి కూడా అనేక విషయాలను తెలుసుకున్నారట.

బుధవారం ఉదయం బేగంపెట్ మహిళా పోలీస్ స్టేషన్‌కు అఖిలప్రియను పోలీసులు తరలించారు. నార్త్ జోన్ డీసీపీ కమలేశ్వర్, ఇద్దరు ఏసీపీల బృందం కలిసి కిడ్నాపర్లతో అఖిలప్రియ ఫోన్‌ సంభాషణ గురించి ప్రశ్నించగా.. తాను మాజీ మంత్రినని, ఎంతో మంది తనకు ఫోన్‌ చేస్తారని, ఆ క్రమంలోనే గుంటూరు శ్రీను మాట్లాడాడని అఖిలప్రియ వాదిస్తోందట. అయితే ఆమె భర్త భార్గవ్‌రామ్, శీనులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారని కూడా ఆమెను పోలీసులు ప్రశ్నించారట. వారి కాల్ డేటా, సిమ్ కార్డ్ నెంబర్లు, టవర్ లొకేషన్, తదితర ఆధారాలను ఆమె ముందుంచి మరీ విచారించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం భార్గవ్‌రామ్, శ్రీనులతో పాటు కేసుతో సంబంధం ఉన్న మరో 19 మంది నిందితులు కూడా పోలీసుల కస్టడీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. కిడ్నాప్ సమయంలో ప్రవీణ్‌రావు నివాసం దగ్గర భార్గవ్‌రామ్  రెక్కీ నిర్వహించాడని, ఆ తర్వాత వారిని పథకం ప్రకారం కిడ్నాప్ చేసి.. ముగ్గురిని భార్గవ్ ఫామ్‌హౌస్‌లో బంధించాడని తెలుస్తోంది. బాధితుల నుంచి డాక్యుమెంట్స్‌పై సంతకాలు సేకరించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో మరిన్ని క్లూస్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా.. గురువారం మధ్యాహ్నంతో అఖిల ప్రియ కస్టడీ ముగియనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: