టీడీపీలో రాత్రికి రాత్రి ఓ అనూహ్య ప‌రిణామం తెర‌మీద‌కి వ‌చ్చింది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ను స‌మ‌ర్ధిస్తూ.. పార్టీ నాయ‌కులు కొమ్మారెడ్డి ప‌ట్టాభి, వ‌ర్ల రామ‌య్య‌లు.. భారీ డైలాగులు పేల్చారు. ``చంద్ర ‌బాబు క్రిస్టియ‌న్లను ఏమీ అనలేదు. కానీ, ఓ వ‌ర్గం క్రిస్టియ‌న్లు.. చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌ను వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తున్నారు`` అని వ‌ర్ల‌... ప‌ట్టాభి వేర్వేరుగా స్పందించారు. వాస్త‌వానికి పార్టీలో ఎవ‌రైనా త‌ప్పులు చేస్తే.. చంద్ర‌బాబుస‌రిచేయాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ, ఇప్పుడు ఆయ‌న‌నే స‌రిచేసేందుకు ఈ ఇద్ద‌రు రంగంలోకి దిగ‌డం, కీల‌క‌మైన లోకేష్‌, దేవినేని ఉమా.. వంటి నాయ‌కులు సైలెంట్ కావ‌డం గ‌మ‌నార్హం.

దీనికి కార‌ణం ఏంటి? అనే చ‌ర్చ జోరుగానే సాగుతోంది. విష‌యంలోకి వెళ్తే.. దేవాల‌యాల‌పై జ‌రుగుతున్న వ‌రుస దాడుల నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఇటీవ‌ల రామ‌తీర్థం ప్రాంతానికి వెళ్లారు. అక్క‌డే ఆయ‌న మీడి యాతో మాట్లాడుతూ.. క్రిస్టియ‌న్ ముఖ్య‌మంత్రి వ‌చ్చిన త‌ర్వాత‌.. దేవాల‌యాల‌పై దాడులు జ‌రుగుతు న్నాయ‌ని విరుచుకుప‌డ్డారు. అంతేకాదు, జ‌గ‌న్ హ‌యాంలో హిందువుల‌ను క్రిస్టియ‌న్లుగా మారుస్తున్నార‌ని విమ‌ర్శించారు. ``పాస్ట‌ర్ల‌కు నెల నెలా ఐదు వేలు ఎవ‌రైనా ఇస్తారా?  త‌న సొమ్ము కాక‌పోయే స‌రికి జ‌గ‌న్ దోచి పెడుతున్నారు`` అంటూ.. చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు చేశారు.

నిజానికి అప్ప‌టి వ‌ర‌కు కూడా చంద్ర‌బాబు లౌకిక నేత‌గా ముద్ర ప‌డ్డారు. కానీ, ఈ వ్యాఖ్య‌ల‌తో ఆయ‌న‌పై క్రిస్టియ‌న్లు తీవ్ర అస‌హ‌నంతో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే పార్టీ నామినేటెడ్  మాజీ ఎమ్మెల్యే తోచ‌ర్‌.. ఇటీవ‌ల పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. దీనికి బాబు అనుకూల మీడియా తొక్కి పెట్టింది. అయితే.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై తాజాగా మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్టియ‌న్ సంఘాలు భారీ ఎత్తున ఉద్య‌మించాయి.

ప‌లు చోట్ల చంద్ర‌బాబు ఫ్లెక్సీల‌ను అవ‌మానించారు కూడా. ఇక‌, క్రిస్టియ‌న్ నేత‌లు పార్టీకి రాజీనామాలు చేశారు. ఈ అనూహ్య ప‌రిణామంతో టీడీపీ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌ను అపార్థం చేసుకున్నారంటూ.. వ‌ర్ల‌రామ‌య్య‌.. ప‌ట్టాభి స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మనార్హం. మ‌రి ఇది ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: