జ‌న‌సేన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు అడ్డంగా దొరికిపోయార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్ర‌ధానంగా రెండు విష‌యాల్లో ప‌వ‌న్‌.. స‌మాధానం చెప్ప‌లేక పోతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌టి.. తిరుప‌తి ఉప ఎన్నిక విష‌యంలో బీజేపీ దూకుడు, రెండు రాష్ట్రంలో స్థానిక ఎన్నిక‌లు. ఈ రెండు విష‌యాల్లోనూ ప‌వ‌న్‌.. ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌క‌పోవ‌డం.. ఆయా విష‌యాలు రోజు రోజుకు తీవ్రంగా మారుతుండ‌డంతో నెటిజ‌న్లు ప‌వ‌న్‌పై స‌టైర్లు వేస్తున్నారు. ``అయ్యా..మీరు ఎవ‌రినో ప్ర‌శ్నించడం కాదు..మేం మిమ్మ‌ల్ని ప్ర‌శ్నిస్తాం.. స‌మాధానం చెప్పండి`` అనే కామెంట్లు ప‌వ‌న్ సోషల్ మీడియా ఖాతాకు పోటెత్తుతున్నాయి.

నిజానికి ప‌వ‌న్‌ను ప్ర‌శ్నిస్తున్న‌వారి సోషల్ మీడియా  అకౌంట్ల‌ను బ్లాక్ చేస్తున్నార‌నే వాద‌న ఇటీవ‌ల కాలంలో బ‌లం గా వినిపిస్తోంది. ఇక‌, బీజేపీతో జ‌ట్టు క‌ట్టిన ప‌వ‌న్‌.. ఈ పార్టీతో ఉంటే.. ప్ర‌యోజ‌నాలు నెర‌వేర‌తాయ ని..తాను చూసిన రాజ‌కీయ పార్టీలో అంతో ఇంతో నిబ‌ద్ధ‌త ఉన్న పార్టీ బీజేపీనేన‌ని గ‌తంలో చెప్పుకొచ్చా రు. దీంతో టీడీపీని టార్గెట్ చేస్తూ.. ఆయ‌న అలా కామెంట్లు చేశార‌ని, బీజేపీద‌గ్గ‌ర మంచి మార్కులు కొట్టేశార‌ని.. ఇక‌, బీజేపీతో ప‌వ‌న్ బంధం మ‌రింత బ‌ల‌ప‌డుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు.కానీ, ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక‌కు సంబంధించి ఇంకా నోటిఫికేష‌న్ కూడా రాక‌ముందే.. బీజేపీ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. దీనిపై ప‌వ‌న్ సైలెంట్‌గా ఉన్నారు.

ఇక‌, మ‌రోవైపు స్థానిక ఎన్నిక‌ల విష‌యంలో రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌నర్‌కు, ప్ర‌భుత్వానికి మ‌ధ్య తీవ్ర యుద్ధం సాగుతోంది. గ‌తంలో ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ తీసుకున్న నిర్ణ‌యాన్ని ప‌వ‌న్ స‌మ‌ర్ధించారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఓట్లు త‌ప్ప‌.. ప్ర‌జ‌ల ప్రాణాలంటే విలువ‌, లెక్క లేద‌ని మెసేజ్ చేశారు. ఈ క్ర‌మంలో స్థానిక ఎన్నిక‌లు వాయిదా వేయాల‌న్న‌.. నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ నిర్ణ‌యాన్ని ఆయ‌న స‌మ‌ర్థించారు.

మ‌రిఇప్పుడు ఇదే ప్ర‌జారోగ్యం నేప‌థ్యంలో స్థానికంపై వాయిదా వేయాల‌ని ప్ర‌భుత్వం డిమాండ్ చేస్తోంది. కానీ, నిమ్మ‌గడ్డ మాత్రం.. నిర్వ‌హిస్తామంటున్నారు. ప్ర‌స్తుతం ఇది హైకోర్టుకు ఎక్కింది. సో, ఈనేప‌థ్యంలో ప‌వ‌న్ ఎందుకు మౌనంగా ఉంటున్నార‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. మొత్తానికి ప‌వ‌న్ ఈ రెండు విష‌యాల్లో అడ్డంగా బుక్క‌య్యార‌నే కామెంట్లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.  

మరింత సమాచారం తెలుసుకోండి: