అమరావతి:  ఏపీ ప్రజలు మొత్తం సంక్రాంతి సంబరాల్లో ఉన్నారు. ప్రతి జిల్లాలోనూ ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు. మరోపక్క పందెం రాయుళ్లు కోడి పందేలలో బిజీ బిజీగా గడుపుతున్నారు. డూడూ బసవన్నలు ఒకవైపు, ఇళ్ల ముందు గొబ్బెమ్మలు మరోవైపు ఏపీ మొత్తం కనువిందు చేస్తున్నాయి. కోలాటాలు, సంప్రదాయపు ఆటలతో పల్లెలు మారు మ్రోగుపోతున్నాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ఏ గుడిలో అయినా దేవుడు తల కిందులుగా ఉండటం చూశారా? దేవుడేంటి.. తలకిందులుగా ఉండటం ఏంటి అని అనుకుంటున్నారా? ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక శివాలయంలో శివుడు తలకిందులుగా ఉంటాడని మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఇది నిజం. ఎలమదుర్రు గ్రామంలో ఉన్న శివాలయంలో శివుడు తలకిందులుగా ఉంటాడు. ఇలా ఎందుకు ఉన్నాడనే సందేహం అందరికి వస్తుంది. శివుడు తల కిందులుగా ఉండటం అంటే.. తపస్సు చేస్తున్నట్లు తల కిందకి, కాళ్లు పైకి పెట్టి ఉంటాయట. ఇక శివుడు విగ్రహమే కాదు.. పార్వతీ దేవి విగ్రహం కూడా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఉంటుంది ఈ శివాలయంలో. ఈ ఆలయంలోని పార్వతీదేవి కుమారస్వామికి పాలు ఇస్తున్నట్లు ఉంటుంది. ఈ ఆలయం గురించి ఇప్పుడే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. సంక్రాంతి వచ్చిందంటే ఈ శివాలయం ముందు యువతీ యువకులు కోలాటం ఆడడం విశేషంగా వస్తోంది. ప్రతి సంక్రాంతి సమయంలో యువతీ యువకులు ఇదే విధంగా కోలాటం ఆడుతూ ఉంటారని చెబుతున్నారు. వీరితో పాటు మరోపక్క హరిదాసులు, సంకీర్తనలు, గంగిరెద్దు మేళాలు కూడా సంప్రదాయంగా జరుపుకోవడం ఆచారంగా వస్తోంది. ఈ ఆలయంలో మరిన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటంటే.. శివుడుకు ప్రసాదం చేసి నైవేద్యంగా ఇచ్చేది ఆలయం పక్కనే ఉన్న కోనేరు నీళ్లట. కోనేరు నుంచి నీటిని తీసుకువచ్చి ఆ నీటితోనే దేవుడికి ప్రసాదం తయారు చేసి నైవేధ్యంగా పెడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: