హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్న 11 మంది కిడ్నాపర్లని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. కిడ్నాపర్ల కోసం బెంగళూరు, చెన్నై, పుణే, గోవా, విజయవాడ ఇలా దాదాపుగా పదిహేను ప్రాంతాలకి పదిహేను బృందాలుగా పోలీసులు వెళ్లి గాలించారు. ఈ క్రమంలో గోవాలో జల్సాలు చేస్తున్న కిడ్నాపర్ల గ్యాంగ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ తీసుకువచ్చినట్లు సమాచారం. మొత్తం పదిహేను బృందాలతో కలిసి కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు వారందరినీ ప్రస్తుతానికి ఒక రహస్య ప్రాంతంలో ఉంచినట్లు చెబుతున్నారు. 

అయితే వీరంతా కిడ్నాపర్ లే అయినా అసలు సూత్రధారి అయిన అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, చంద్రహాస్ అలాగే గుంటూరు శ్రీను మాత్రం దొరకలేదు. ఇక ఈ కేసుతో అఖిలప్రియ తమ్ముడు జగత్ రెడ్డికి కూడా ప్రత్యక్ష ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. అఖిల ప్రియ అరెస్టు సమయంలో ఈయన్ని కూడా విచారించిన పోలీసులు సంబంధం లేదని భావించి వదిలేశారు. అయితే అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన జగత్ విఖ్యాత రెడ్డికి ఇప్పుడు ఈ కేసులో సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. 

ఆయన డ్రైవర్ ని అరెస్ట్ చేసి విచారించగా పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆధారాలు లభించగానే ఈ కేసులో ఆయనను కూడా నిందితులుగా చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ కేసులో అఖిలప్రియకు పోలీస్ కస్టడీ ముగిసింది.ఈరోజు వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె మరోమారు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. కోర్టులు సెలవులో ఉన్న కారణంగా ఈరోజు న్యాయమూర్తి నివాసంలో ఆమెను హాజరు పరిచి అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: