అమరావతి: సీఎం జ‌గ‌న్ కంచుకోట క‌డ‌ప‌ జిల్లాలో సత్తా చాటాలనే తెలుగుదేశం పార్టీ కల ఎప్పటికీ కలగానే మిగిలిపోయేలా ఉంది. ఇప్పటికే టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా నాయకుల కొరత విపరీతంగా ఉంది. ఈ సమస్యతో అల్లాడుతున్నప్పటికీ టీడీపీ ఎలాగైనా కడపలో పాగా వేయాలని చాలా కాలంగా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం ర‌మేష్‌, ఆదినారాయ‌ణ‌రెడ్డి, రామ‌సుబ్బారెడ్డి, బీటెక్ రవి వంటి నాయకులు కడపలో టీడీపీకి వెన్నెముకల్లా ఉండేవారు.

అయితే వైసీపీ గెలుపు తర్వాత ఒక్క బీటెక్ రవి తప్ప మిగతా ప్రధాన నాయకులంతా పార్టీ వీడి వెళ్లిపోయారు. వీరిలో రామ‌సుబ్బారెడ్డి వైసీపీలోకి వెళ్లిపోగా.. మిగిలిన చాలా మంది నాయ‌కులు బీజేపీ వైపు వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు టీడీపీ జెండా మోసే నాయ‌కులే కడపలో క‌నిపించ‌డం లేదు. అయితే అప్పటి నుంచి బీటెక్ ర‌వి దూకుడుగా ఉంటూ జిల్లాలో పార్టీ బలోపేతం దిశగా ప్రయత్నించారు.

ఇలాంటి సందర్భంలో బీటెక్ ర‌విపై ఎప్పటిదో కేసు తిరగదోడిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. దీంతో టీడీపీ జిల్లా నేతల్లో కలవరం మొదలైంది. పార్టీ జెండా మోయడం సరికదా.. పార్టీ పేరును కూడా బయట చెప్పుకోవడానకి భయపడుతున్నారు. 2018 మార్చి 4న రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కేసులో రవిని అరెస్ట్ చేసి క‌ప‌డ సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు. ఈ ఘటనతో స్థానికంగా టీడీపీతో పాటు ఇతర పార్టీ నేతలు కూడా భయపడి సైలెంట్ అయిపోయారు.

బీటెక్ రవి అరెస్టుతో స్థానిక నాయ‌కులు, చిన్నచిన్న లీడ‌ర్లు పత్తా లేకుండ పోయారు. ఇక టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. చంద్ర‌బాబు పిలుపునిచ్చినా జిల్లాలో పార్టీ నాయకుల్లో పలికేవారు లేకుండా పోయారు. సైలెంట్‌గా ఉంటూ పార్టీ కార్యక్రమాల జోలికి వెళ్లేందుకు కూడా సాహసించడం లేదు. దీనికి కారణం.. వీరిలో చాలా మందిపై ఇప్పటికే కేసులు ఉండ‌డమే. ఇప్పుడు బయటకు వస్తే త‌మ‌పై కేసుల‌ను కూడా బయటకు తీస్తారని భ‌యపడుతున్నట్లు తెలుస్తోంది.

చంద్ర‌బాబుకు ఈ విష‌యం తెలిసి కూడా ఎవ‌రిలోనూ ధైర్యం నింపే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌డం ఇక్కడ ఆశ్చర్యకరం. ఈ క్రమంలో కడపలో టీడీపీ కోలుకోవడం అనేది ఆ పార్టీకి కలేనని నిపుణులు సైతం పెదవి విరుస్తున్నారు. ఇలానే కొనసాగితే కడపలోనే కాకుండా పూర్తి రాష్ట్రంలోనే టీడీపీ కనుమరుగైపోయినా ఆశ్చర్యం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: