అమరావతి: రాష్ట్ర విద్యావ్యవస్థలో ఇప్పటికే అనేక మార్పులు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు కచ్చితంగా స్కూళ్లకు హాజరయ్యేలా చర్యలు తీసుకునేలా ఓ ప్రత్యేక విధానాన్ని స్కూళ్లలో అమలు చేయనున్నారు. దీని ద్వారా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరగడమే కాక.. వారికి కూడా పూర్తి స్థాయిలో చదువునభ్యసించే అవకాశం లభిస్తుందనేది ప్రభుత్వ ఆలోచన.

నూతన విధానం ప్రకారం.. ఎవరైనా విద్యార్థి ఒక్కరోజు పాఠశాలకు రాకపోయినా వెంటనే విద్యార్థుల తల్లిదండ్రుల సెల్ ఫోన్‌కు ఆటోమేటిక్‌గా మెసేజ్ వెళ్లేలా సరికొత్త విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఇక రెండో రోజు కూడా విద్యార్థి పాఠశాలకు హాజరు కాకపోతే ఆ ప్రాంతంలోని వాలంటీర్ సదరు విద్యార్థి ఇంటికెళ్లి మరీ గైర్హాజరీకి కారణం తెలుసుకోవడం జరుగుతుంది. అనారోగ్య సమస్య కారణమా లేక ఇంకేదైనా కారణమా అనే విషయం వాలంటీర్ తెలుసుకోవడం జరుగుతుంది. తద్వారా తదుపరి చర్యలు తీసుకోవడానికి సాధ్యమవుతుంది. ఈ విధానం ప్రతి రోజూ విద్యార్థి పాఠశాలకు హాజరయ్యేలా చూస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఒకవేళ ఎవరైనా తల్లిందండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపేందుకు నిరాకరిస్తే వారికి అర్థమయ్యేలా నచ్చజెప్పి పిల్లలను బడికి పంపించేలా చూసే బాధ్యతను గ్రామ సచివాలయలకు అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో పిల్లల తల్లిదండ్రులతో పాటు చాలా మంది ప్రముఖులు ఈ ఐడియా వర్క్ అవుట్ అయితే ఏపీలో నిరక్షరాస్యత రాబోయే రోజుల్లో పూర్తిగా కనుమరుగవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదిలా ఉంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఏపీలో అనేక సంచలన మార్పులు చోటు చేసుకున్నాయి. విద్యావ్యవస్థను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. పేదలకు తమ పిల్లల చదువు భారం కాకుండా ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి వారిని ఆదుకుంటున్నారు. పిల్లల స్కూల్ ఫీజు కోసం “అమ్మ ఒడి” పథకం ద్వారా తల్లి బ్యాంకు ఖాతాలో నగదు వేస్తూ వారి పిల్లకు చదువు వైపు మళ్లిస్తున్నారు. ఇక నాడు-నేడు కార్యక్రమంతో పాఠశాలలో అన్ని వసతులు ఉండేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: