హైదరాబాద్: ఏడాదిగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు చెక్ పెట్టేందుకు ప్రపంచ దేశాలు ఏకమై తయారు చేసుకున్న ఆయుధం వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్‌ ప్రజలకు అందించేందుకు, వారిని కరోనా బారిన పడకుండా కాపాడేందుకు కరోనాను నిర్మూలించడంలో భాగంగా కేంద్రం తాజాగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే రాష్ట్రాలకు వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి కూడా వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. కేంద్ర ఆదేశాలతో 16వ తేదీ నుంచి ప్రజలకు వ్యాక్సిన్ డోసులను అందించే కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో తొలి వ్యాక్సిన్ డోస్ ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది.

తొలి టీకా ఆరోగ్య సిబ్బందికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే కేంద్రం ఆదేశాలిచ్చింది. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ అనేకసార్లు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశాల్లో కూడా ప్రస్తావించారు. దీని ప్రకారమే ఆయా రాష్ట్రాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయి. వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అందులో వైద్య సిబ్బందిని నియమిస్తున్నాయి.

ఈ క్రమంలోనే కరోనా తొలి టీకా విషయంలో కేసీఆర్ సర్కార్ కేంద్రం సూచనలను పక్కనపెట్టింది. ప్రధాని సూచించినట్లు ఆరోగ్య సిబ్బందికి కాకుండా ఆసుపత్రిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు తొలి టీకా అందివ్వాలని కేసీఆర్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వ్యాక్సిన్ పంపిణీలో మార్పులు చేస్తున్నారు. పారిశుధ్య కార్మికుడికి వ్యాక్సిన్ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  

ఇదిలా ఉంటే రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. తొలిరోజు 4 వేల మందికి వ్యాక్సిన్ అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం ఒక్కో కేంద్రంలో 139 మందికి టీకా వేయించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మరి అంతా అనుకున్నట్లు జరిగితే టీకాకరణ రాష్ట్రంలో విజయవంతం అవుతుంది. కరోనానుంచి రాష్ట్రానికి విముక్తి లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: