భోపాల్: ఒకపక్క బాల్య వివాహాలను నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అనేక వివాహాలను నిరోధిస్తున్నాయి. కానీ ఇప్పటికీ అనేక చోట్ల ఈ బాల్య వివాహాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ సమావేశంలో మాట్లాడిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్.. ఆడపిల్లల వివాహ వయసును కూడా 21 సంవత్సరాలకు పెంచాలని అన్నారు. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ నేత సజ్జన్ సింగ్ వర్మ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లలు 15 ఏళ్లకే తల్లి అయ్యేందుకు సిద్ధంగా ఉంటారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

‘‘ఆడామగ మధ్య పెళ్లి విషయంలో వయోబేధాలు ఉన్నాయి. మహిళలకు ఎందుకు 18 ఏళ్లకే పెళ్లి వయసు ఉండాలి. మగవారికి 21 ఏళ్ల వయసు ఉన్నట్లే ఆడవారి విషయంలో కూడా వయసును 21కి సవరించాలి’’ అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను వర్మ ఊటంకిస్తూ ‘‘డాక్టర్లు చెప్పిన ప్రకారమే, బాలికలు 15 ఏళ్ల వయసుకే పిల్లల్ని కనడానికి సిద్ధంగా ఉంటారు. ముఖ్యమంత్రి (శివరాజ్‌సింగ్) ఏమైనా డాక్టరా? ఆయన ఏ ప్రాతిపదికపైన పెళ్లికి మహిళల వయసు పెంచాలని అనుకుంటున్నారు?’’ అని వర్మ ప్రశ్నించారు.

వర్మ చేసిన వ్యాఖ్యలపై అనేకమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్‌సీపీసీఆర్) ఆయనకు నోటీసులు పంపింది. మైనర్ బాలికలపై ఆ వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేశారని, ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న అంతర్యాన్ని వివరించాలని వర్మకు ఆ నోటీసుల ద్వారా ప్రశ్నించింది. అయితే వర్మ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత భూపెంద్ర గుప్త వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. పెళ్లి విషయంలో మహిళల వయసును పెంచాలని ముఖ్యమంత్రి ఏ ప్రాతిపదికన అన్నారోనని, దానికి శాస్త్రీయపరమైన కారణాలుంటే చెప్పాలనే కోణంలోనే వర్మ ఆ వ్యాఖ్యలు చేశారని వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: