హైదరాబాద్: తెలుగు నాట సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్‌ రెడ్డి హస్తం కూడా ఉందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగత్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో అఖిల ప్రియ సోదరుడు జగత్ పాత్రపై పోలీసుల దర్యాప్తు చివరి దశకు చేరినట్లు సమాచారం. కిడ్నాప్ వ్యవహారంలో జగత్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. జగత్ విఖ్యాత్ కారు డ్రైవర్ ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా ఈ కేసులో జగత్ ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. సీసీ ఫుటేజీ, కాల్ డేటా ఆధారంగా పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చినట్లు చెప్తున్నారు.  

ఇక ఇదే కేసులో మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉన్న అఖిల ప్రియ కస్టడీ సమయం ముగిసింది. దీంతో ఆమెకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కస్టడీ ముగిసిన వెంటనే ఆమెకు వైద్య పరీక్షలు చేశారు. కరోనా పరీక్షల్లో ఆమెకు నెగిటివ్ వచ్చింది. దీంతో ఆమెను జడ్జి ఎదుట హాజరు పరిచారు. జడ్జి రిమాండ్ విధించడంతో అఖిల ప్రియను చంచల్ ‌గూడ జైలుకు తరలించారు.

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో భూమా కుటుంబ సభ్యుల పాత్ర దిశగా పోలీసుల దర్యాప్తు సాగించారు. అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారించారు. కిడ్నాప్ వ్యవహారంలో జగత్ విఖ్యాత్ ప్రమేయం ఉన్నట్లు తొలుత పోలీసులు అనుమానం వ్యక్తపరిచారు. కిడ్నాప్ ప్రణాళిక అమలు చేయడానికి ముందు కిడ్నాపర్లతో జగత్ మాట్లాడినట్లు అనుమానాలు ఉన్నాయి. అఖిల ప్రియ అరెస్ట్ సమయంలోనే జగత్ విఖ్యాత్ రెడ్డిని పోలీసులు విచారించారు. అయితే అతనిపై అప్పుడు అనుమానాలు లేకపోవడంతో కొన్ని వివరాలు మాత్రం సేకరించి వదిలేశారు. తాజాగా జగత్ విఖ్యాత్ డ్రైవర్ చెప్పిన ఆధారాలతో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: