చిన్నపిల్లలు మారం చేసిన ప్రతిసారి చాల మంది పేరెంట్స్ పిల్లలకి చాక్లెట్, లాలీ పాప్, బిస్కట్ వంటివి కొనిస్తూ ఉంటారు. ఇక మీరు కూడా మీ పిల్లలకు లాలీ పాప్ వంటివి కొనిస్తున్నారా అయితే జాగ్రత్త సుమీ. ముఖ్యంగా లాలీ పాప్ లు కొనేవారైతే ఒకటికి రెండింతలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లాలీపాప్ లంటే పిల్లలు లొట్టలేసుకుని తింటారు. ఎన్ని చాక్లెట్లు తీసుకొచ్చినా.. చాలా మంది పిల్లలు లాలీపాప్ లనే ఇష్టంగా తింటారు. కానీ ఇవి కల్తీ అవుతున్నాయి.

ఇక లాలీపాప్ ని టాల్కమ్ పౌడర్ లతో తయారుచేస్తున్నారట. ఇదేదో అమెరికాలోనో.. ఆస్ట్రేలియాలోనో కాదు.. మన దేశంలోనే. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో గల ఉదోగ్ నగర్ లో ఉన్న కెఎస్ తినుబండారాల ఫ్యాక్టరీల మీద ఫుడ్ సెక్యూరిటీ అధికారులు దాడి చేశారు. వారికి అక్కడ లాలీపాప్ లలో టాల్కమ్ పౌడర్ కలుపుతున్న దృశ్యాలు విస్తుగొలిపాయి.

అంతేగాక పరిశుభ్రత లేకుండా.. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకుండా క్యాండీలను తయారుచేయడం.. క్యాండీలలో కల్తీ, లేబులింగ్ నిబంధనలను ఉల్లంఘించడం వంటివి చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దాడి చేస్తున్న సమయంలోనే అధికారులకు అక్కడ కొన్ని సంచుల్లో తెల్ల పౌడర్ కనిపించింది. దాని గురించి ఆరా తీయగా అది టాల్కమ్ పౌడర్. ఆ పౌడర్ ను లాలీపాప్, క్యాండీలలో కలుపుతున్నారట.

దాడి చేసిన తర్వాత.. సదరు ఇండస్ట్రీలోని 4,200 కిలోల లాలీపాప్ లు, 5,600 కిలోల క్యాండీల (మొత్తం 9,800 వేల కిలోలు) ఉత్పత్తులను అధికారులు సీజ్ చేశారు. దాంతో పాటు ఆ పరిశ్రమను కూడా తాత్కాలికంగా మూసివేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా.. కల్తీ వ్యాపారం చేస్తున్నందుకు గానూ సదరు సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: