సియోల్: మన దేశ భాష హిందీ కోసం పరాయి దేశంలో విద్యార్థులు పోరాడుతున్నారు. అది కూడా ఆసియా ఖండం చివర్లో ఉండే దక్షిణ కొరియాలో. ఇంతకీ ఇక్కడ ఈ పోరాటం ఎందుకో తెలుసా? ఇక్కడి ప్రఖ్యాత బుసాన్ యూనివర్సిటీలో హిందీ భాష అధ్యయనానికి సంబంధించిన కోర్సును తొలగించాలని నిర్ణయించారు. ఇదిగో ఇదే వద్దంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హిందీ భాషా కోర్సులను తొలగించాలని యూనివర్శిటీ అధికారులు నిర్ణయించడాన్ని వాళ్లు ఒప్పుకోవడం లేదు. వర్సిటీ నిర్ణయంపై అభ్యంతరాలు తెలుపుతున్నారు. అంతే కాకుండా.. ఈ విషయమై సియోల్‌లోని భారత ఎంబసీకి కూడా ఫిర్యాదు చేశారంటే వాళ్లు ఈ ఇష్యూను ఎంత సీరియస్ గా తీసుకున్నారో తెలిసిపోతుంది.

దక్షిణ కొరియాలోని బూసాన్ యూనివర్శిటీ, హాన్‌కుక్ యూనివర్శిటీల్లో మాత్రమే హిందీ భాష అధ్యయనానికి సంబంధించిన కోర్సులు ఉన్నాయి. బుసాన్ విశ్వ విద్యాలయంలో 1983లో హిందీ భాష కోసం ఇండియన్ స్టడీస్ విభాగం ఏర్పాటయింది. దానికన్నా ముందుగానే అంటే 1972 నుంచే హాన్‌కుక్ యూనివర్శిటీలో హీందీ భాషపై ప్రత్యేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి.  కాగా.. కొద్ది వారాల క్రితం బుసాన్ వర్సిటీలోని ఇండియన్ స్టడీస్ విభాగం ఓ కీలక ప్రకటన విడుదల చేసింది.

హిందీ భాషకు సంబంధించిన కోర్సులకు ముగింపు పలికాలని అధికారులు ఆలోచిస్తున్నారని, త్వరలోనే ఈ కోర్సులు తొలగించే యోచనలో యూనివర్శిటీ ఉందనేది ఈ ప్రకటన సారాంశం. భారత్‌లో ఉద్యోగాలుచేయాలనుకునే దక్షిణ కొరియా వారికి ఇంగ్లీష్ వస్తే సరిపోతుందని కూడా ఈ ప్రకటన పేర్కొంది. అయితే.. ఈ ప్రకటనతో హిందీ భాషా కోర్సులు చేస్తున్న విద్యార్థుల్లో పెద్ద ఎత్తున కలకలం రేగింది. వారు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపడం ప్రారంభించారు. ఈ విషయమై లీ జున్‌హాక్ అనే వ్యక్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హీందీ భాష అధ్యయనం ద్వారా భారత్‌లోని మారుమూల ప్రాంతాలను కూడా చేరుకుని అక్కడి సంస్కృతులను అధ్యయం చేయచ్చని అతను అంటున్నాడు. మరోవైపు.. హీందీ భాషపై ఆసక్తిగల విద్యార్థులు సియోల్‌లోని భారత ఎంబసీకి, ఇతర దేశాలతో సాంస్కృతిక సంబంధాలకు కృషి చేసే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్‌కు
 కూడా ఈ విషయమై ఫిర్యాదులు చేస్తున్నారు. అంతే కాదండోయ్.. మన  ప్రధాని నరేంద్ర మోదీకి కూడా విషయం వివరిస్తూ ఓ వీడియో సందేశాన్ని పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: