మన దేశంలో యూకే స్ట్రెయిన్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సాధారణ కరోనా కంటే... యూకే స్ట్రెయిన్‌కు వేగంగా విస్తరించే గుణం ఉంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం, సాధ్యమైనంత త్వరగా ఈ కేసుల్ని గుర్తించే పనిలో ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయల్లో ప్రయాణీకులను క్షుణ్ణంగా పరీక్షించడంతో పాటు క్వారంటైన్‌ నిబంధనల్ని కఠినంగా అమలు చేయనుంది ప్రభుత్వం.

ఎంత అప్రమత్తంగా ఉన్నా... దేశంలో కరోనా యూకే  స్ట్రెయిన్ కేసుల సంఖ్య పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఈ రకం కరోనా వైరస్ కేసుల సంఖ్య 109కి చేరింది. మొన్నటి 11 తేదీ నాటికి 96 కేసులుంటే... మూడు రోజుల్లో అవి 109కి చేరడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కొత్త రకం కరోనా వైరస్... చాపకింద నీరులా విస్తరిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.    

బ్రిటన్‌లో రూపాంతరం చెందిన కొత్త రకం కరోనా వైరస్‌ గుర్తించిన తర్వాత మన దేశం కూడా అప్రమత్తమయ్యింది. యూకే నుంచి వచ్చే విమాన సర్వీసులను గత ఏడాది డిసెంబర్‌ 22 వరకు రద్దు చేసింది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రత్యేక వైద్య బృందాలను నియమించి... స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహిస్తోంది. విదేశాల నుంచి వచ్చే వాళ్లు హోం క్వారంటైన్లో ఉండేలా చర్యలు చేపట్టింది. మరోవైపు... ఈ నెల 8 నుంచి యూకే విమాన సర్వీసులను పునరుద్దరించింది భారత ప్రభుత్వం. అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 14 రోజులు క్వారంటైన్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా... దేశంలో కొత్త స్ట్రెయిన్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

కరోనా యూకే స్ట్రెయిన్ ప్రభావం అమెరికా, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, స్వీడన్‌, స్విడ్జర్లాండ్‌, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్‌, సింగపూర్ తదితర దేశాలపై పడింది. దీంతో ఆయా దేశాల్లో  కొత్తగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పాటు మరణాలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త స్ట్రెయిన్‌ను సమర్థవంతంగా కట్టడి చేసే దిశగా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయినా, కొత్త కేసులు క్రమేపీ పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తమౌతోంది. నిబంధనల్ని మరింత కఠినంగా అమలు చేసే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: