జావా సముద్రంలో కూలిపోయిన ఇండోనేషియా విమాన శకలాల, మృతుల కోసం గాలింపు కొనసాగుతోంది. 4 వేల మంది సిబ్బంది గాలింపు చర్యలో పాల్గొంటున్నారు. పెద్ద సంఖ్యలో హెలికాఫ్టర్లు, నౌకలు, రాఫ్ట్ బోట్‌లను కూడా వినియోగిస్తున్నారు. పైలెట్‌, కో-పైలెట్‌ విశేష అనుభవం ఉన్న వాళ్లే కావడంతో ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమై ఉంటుందని భావిస్తున్నారు. కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డు కోసం అన్వేషణ కొనసాగుతోంది.
 
గత శనివారం ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి బయలుదేరిన విమానం... కొద్ది సేపటికే అదృశ్యమైంది. విస్తృత గాలింపు తర్వాత జావా సముద్రంలో విమానం కూలిపోయినట్టు గుర్తించారు. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 62 మంది చనిపోయినట్టు నిర్దారించారు అధికారులు.    

శ్రీ విజయ విమానయాన సంస్థకు చెందిన బోయింగ్‌ విమానం SJ-182కు సంబంధించిన శకలాలను సముద్ర గర్భంలో సుమారు 23 మీటర్ల లోతులో ఉన్నాయి. దీంతో వాటిని వెలికి తీసే పని ముమ్మరంగా సాగుతోంది. డైవర్ల సాయంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు.

సముద్రంపై తేలియాడుతున్న శకలాలు, మృతుల శరీర భాగాలను సేకరించే పనిలో పెద్ద సంఖ్యలో సహాయ బృందాలు పాల్గొంటున్నాయి. థౌజెండ్‌ ఐలాండ్‌లోని జావా సముద్ర తీర ప్రాంతాల్లో 13 హెలికాఫ్టర్లు, 55 నౌకలు, 18 రాఫ్ట్ బోట్‌లతో గాలింపు చర్యలు జరుగుతున్నాయి. 4 వేల మందికి పైగా సహాయక సిబ్బంది గాలింపు చర్యలు పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు 141 మానవ అవశేషాలతో కూడిన బ్యాగులను పోలీస్‌ ఐడెంటిఫికేషన్‌ ఎక్స్‌పర్ట్‌లకు పంపారు. మరోవైపు... మృతుల్ని గుర్తించేందుకు వాళ్ల కుటుంబ సభ్యులు dna శాంపిల్స్‌ తీసుకుంటున్నారు అధికారులు. ఇప్పటి వరకు ఆఫ్‌-డ్యూటీ పైలట్‌, ఫ్లైట్‌ అటెండెంట్‌  సహా మొత్తం ఆరుగురి మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు అధికారులు.     

ఇదిలా ఉంటే...  విమాన పైలెట్‌, కో-పైలెట్‌ విశేష అనుభవం గల వాళ్లంటోంది శ్రీవిజయ విమానయన సంస్థ. కెప్టెన్‌ అఫ్వాన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో  హెర్క్యులెస్‌ పైలట్‌గా తన కెరీర్‌ ప్రారంభించారు. ఆయనకు కొన్ని దశాబ్దాల అనుభవం ఉంది. అలాగే, కో-పైలట్‌ డియాగో మమహిట్‌ కూడా అనుభవశాలి. దీంతో సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు.

రెండు రోజుల క్రితం విమానానికి సంబంధించిన ఒక బ్లాక్‌ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్లాక్‌ బాక్స్‌ ఫ్లైట్‌ డేటా రికార్డర్‌గా నిర్ధారించారు అధికారులు. కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ గల రెండో బ్లాక్‌ బాక్స్‌ కోసం అన్వేషణ కొనసాగుతోంది. రెండో బ్లాక్‌ బాక్స్‌ కూడా దొరికితే ప్రమాదానికి ముందు జరిగింది? ఆ సమయంలో పైలెట్‌, కోపైట్‌ మధ్య ఎలాంటి సంభాషణలు జరిగాయి. సాంకేతిక లోపాన్ని దేన్నయినా గుర్తించారా? సహాయం కోసం ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ను సంప్రదించే ప్రయత్నం చేశారా? ప్రమాదానికి ఎంత సేపటి ముందు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి వంటి వివరాలు తెలుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: