అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తోంది. గతంలో వందలకు వందలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 94 కరోనా కేసులు మాత్రమే వెలుగు చూశాయి. ఈ రోజు నమోదైన కేసులతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ లో 8 లక్షల 85 వేల 710 కరోనా కేసులు నమోదైనట్లు తేలింది. ఈ 24 గంటల్లో కరోనాతో కేవలం ఒక్కరే మృత్యు వాత పడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 7 వేల 139 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఏపీలో 2 వేల 199 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. కరోనా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల 76 వేల 372 మంది కోలుకున్నారని సమాచారం. కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ జాగ్రత్తలు మాత్రం మర్చిపోవద్దని వైద్యులు సూచించారు. శానిటైజర్, మాస్కులు తప్పని సరిగా వాడాలని డాక్టర్లు చెప్తున్నారు.

తెలంగాణలో కూడా వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 202 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ లో తెలిపింది. దీంతో ఇప్పటి వరకూ తెలంగాణలో 2 లక్షల 91వేల 118 కరోనా కేసులు నమోదైనట్లు సమాచారం. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1574 మంది కరోనా మహమ్మారితో మృతి చెందారు. కాగా, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 4 వేల 442 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. అలాగే మొత్తమ్మీద 2 లక్షల 85వేల 102 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: