వైసీపీ నాయకులు తాన అంటే తందానా అన్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలాసలో టీడీపీ కార్యకర్త లక్కోజు వినోద్ అదృశ్యమయ్యారు. అయితే వినోద్‌ను పోలీసులు తీసుకెళ్లారని కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి అప్పలరాజుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వినోద్ పోస్టులు పెట్టారని అందుకే తీసుకెళ్లారని కుటుంబసభ్యులు వాపోతున్నారు. వినోద్‌ది నందిగామ మండలం తామరాపల్లి గ్రామం. ఆయన ఆచూకీ కోసం పలాస పోలీస్‌స్టేషన్ వద్ద ఎంపీ రామ్మోహన్‌నాయుడు నిరసనకు దిగారు. అయితే వినోద్ అదృశ్యంపై పోలీసుల పొంతనలేని సమాధానమిస్తున్నారని రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు.
                2019 ఎన్నికలు జరిగిన తరువాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 19 నెలలుగా అరాచకమైన పాలన పలాస కేంద్రంగా సాగుతుందని ఎంపీ రామ్మోహన్ నాయుడు దుయ్యబట్టారు. అక్రమ కేసులు పెట్టి టీడీపీ కార్యకర్తలుపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పలాసలో బీసీ వ్యక్తి అయిన వినోద్ ను సోషల్ మీడియాలో అభ్యంతర పోస్టులు పెట్టడం వల్ల అరెస్టు చేశామని పోలీసులు ముందు చెప్పారని,  తరువాత మద్యం సీసాలు దొరికాయని ఎక్సైజ్ కింద కేసు అంటూ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వినోద్ ను ఏ సెక్షన్ ప్రకారం, ఎక్కడ పెట్టారని అడిగితే పోలీసులు సమాధానం చెప్పడం లేదన్నారు. అర్థరాత్రి పూట కేసు పెట్టి కిడ్నాప్ చేసినట్లు అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు.
                                           టీడీపీ నాయకులపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినట్లు తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటే పోలీసులు పట్టించుకోవడం లేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. రౌడీలను పెట్టి వినోద్ ను కొట్టి, చిత్రహింసలు పెట్టి తరువాత అరెస్టు చేశారన్నారు. వినోద్ ను ఒక్కసారి చూపించమంటే చూపించడం లేదన్నారు. అరాచకమైన పాలన పలాసలో జరుగుతుండటానికి కారణం, ఇక్కడ ప్రజాప్రతినిధులే కారణమంటూ ఆయన ఆరోపించారు. తప్పుడు కేసులతో టీడీపీ నాయకులను ఇబ్బంది పెట్టాలని వైసీపీ నాయకులు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎంపీగా నేనొచ్చాను, రేపు చంద్రబాబు అయినా వచ్చి న్యాయం కోసం పోరాడతారని ఆయన హెచ్చరించారు. తప్పుడు కేసులు పెడితే ముందు పోలీసులే ఇరుక్కుంటారని హెచ్చరించారు. అవసరమైతే హ్యూమన్ రైట్స్ దగ్గరకు, సుప్రీంకోర్టుకైనా వెళతామని ఎంపీ చెప్పారు. వైసీపీ నాయకులు చెబుతుంటేనే పోలీసులు కదులుతున్నారు టీడీపీ నాయకులు చెబుతుంటుంటే పట్టించుకోవడం లేదన్నారు. గతంలోఇలాగే ప్రవర్తించిన పలాస సీఐ ఏ విధంగా ఇబ్బంది పడ్డారో గుర్తించుకోవాలని ఎంపీ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: