మనుషులు తప్పు చేస్తేనే శిక్షిస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. కానీ ఆస్ట్రేలియాలో ఒక పావురం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత నెలలో ఒక రేసింగ్ పావురాన్ని అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇది అమెరికా నుంచి వచ్చిన రేసింగ్ పావురమని వారు భావించారు. భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకొని దాన్ని చంపేయాలని భావించారు.  కానీ తాజాగా ఇది ప్రాణాలతో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ పావురం కాలుకు ఉన్న ట్యాగ్‌ ఆధారంగా ఇది అమెరికాకు చెందిన రేసింగ్ పావురమని గతంలో అధికారులు పేర్కొన్నారు. కానీ దాని లెగ్ ట్యాగ్ నకిలీదని తాజాగా నిపుణులు ధ్రువీకరించారు. ఇది అలబామా నుంచి సుమారు 14,500 కిలోమీటర్లు (9,000 మైళ్లు) ప్రయాణించి మెల్‌బోర్న్‌కు వచ్చినట్లు అధికారులు భావించారు. దీన్ని ముందుగా గుర్తించిన కెవిన్ అనే వ్యక్తి పావురానికి ‘జో’ అనే పేరు పెట్టారు. అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ పేరుమీదుగా దానికి ఆ పేరు పెట్టారు.

ఈ విషయం తెలుసుకున్న అధికారులు పావురాన్ని "బయోసెక్యూరిటీ రిస్క్"గా భావించారు. దీని ద్వారా ఏవైనా ప్రమాదకరమైన వ్యాధులు తమ దేశంలో వ్యాపించే అవకాశం ఉండవచ్చని భావించారు. ప్రమాదాలను దృష్టిలోపెట్టుకొన్ని ముందు జాగ్రత్త చర్యగా దాన్ని చంపేయాలని నిర్ణయించారు. కానీ పక్షుల సంరక్షణకు పాటుపడుతున్న నిపుణులు, పర్యావరణవేత్తలు మాత్రం జో గుర్తింపుపై సందేహం వ్యక్తం చేశారు. పావురం కాలుకు ఉన్న అమెరికన్ రేసింగ్ బ్యాండ్‌లు స్థానికంగా కూడా దొరుకుతాయని, దాని ఆధారంగా విదేశీ పావురంగా ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు.

ఇలాంటి ట్యాగ్‌లను స్థానికంగా పావురాలను పెంచేవారు సైతం ఉపయోగిస్తున్నారని చెప్పారు. జో రేసింగ్ జాతికి చెందనది కాదని, స్థానికంగా కనిపించే టర్కిష్ టంబ్లర్ జాతి పావురమని మెల్‌బోర్న్‌లోని పావురాల సంరక్షణ కేంద్రానికి చెందిన లార్స్ స్కాట్ వివరించారు. ఇవి ఎక్కువ దూరం ప్రయాణించలేవని తెలిపారు. ప్రస్తుతానికి పావురం ప్రాణాలకు ప్రమాదం తప్పినట్లేనని భావిస్తున్నారు. తమ దేశంలో అమల్లో ఉన్న బయో సెక్యూరిటీ నిబంధన వల్ల ఈ పావురంపై ఆంక్షలు విధించినట్లు ఆస్ట్రేలియా ఉప ప్రధాని మైఖేల్ మెక్‌కార్మాక్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: