కరోనా వ్యాక్సినేషన్‌కి కేంద్రం సర్వం సిద్ధం చేస్తోంది. శనివారం ప్రధాని మోడీ టీకా పంపిణీని ప్రారంభించనున్నారు. తొలి రోజు మూడు లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఎవరెవరికి ముందుగా టీకా ఇవ్వాలన్న దానిపై రాష్ట్రాలకు మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్రం. ఇక వ్యాక్సిన్‌ కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తితే కంపెనీలదే బాధ్యత అని కేంద్రం తేల్చి చెప్పింది.

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు అంతా సిద్దమైంది. శనివారం ప్రధాని మోడీ వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తారు. అంతేకాదు.. కోవిన్‌ యాప్‌ను లాంఛ్‌ చేస్తారు. ఆయా ప్రాంతాల్లోని హెల్త్‌కేర్‌ వర్కర్లతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడతారు. తొలి రోజు ఏకంగా మూడు లక్షల మందికి వ్యాక్సినేషన్‌ చేయనున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 2 వేల 934 కేంద్రాలను సిద్ధం చేశారు. వీటిని క్రమంగా పెంచేందుకు రెడీ అయ్యారు. రాబోయే రోజుల్లో 5 వేల కేంద్రాలకు పెంచాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్ర ప్రభుత్వం.

ఇప్పటికే కోటీ 65 లక్షల వ్యాక్సిన్‌ డోసులు దేశం నలుమూలలకు చేరిపోయాయి. ఇందులో కోటీ పది లక్షల వ్యాక్సిన్‌లు సీరం నుంచి కొనుగోలు చేయగా.. 55 లక్షల టీకాలను భారత్‌ బయోటెక్‌ సరఫరా చేసింది. వ్యాక్సినేషన్‌ సందర్బంగా ఏవైనా తీవ్రమైన సమస్యలు తలెత్తితే దానికి కంపెనీదే బాధ్యత అని కేంద్రం చెప్పింది. వ్యాక్సిన్‌ సంస్థలతో జరిగిన ఒప్పందం ఈ విషయాన్ని వెల్లడించింది. అంటే నష్టపరిహారం కోసం బాధితులు కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంటుంది.

ప్రతి సెషన్‌లో వంద మంది లబ్దిదారులకు వ్యాక్సినేషన్‌ చేయాలని కేంద్రం సూచించింది. అంతేకాదు.. వంద వ్యాక్సిన్‌లకు పది శాతం చొప్పున టీకాలను రిజర్వ్‌ చేయాలని చెప్పింది. మొదటగా కోవిన్‌ యాప్‌లో నమోదు చేసుకున్న హెల్త్‌ కేర్‌ వర్కర్లకే మొదటి వ్యాక్సిన్‌ అని చెప్పిన కేంద్రం.. తర్వాత మార్గదర్శకాలు మార్చింది. తొలి దశలో డాక్టర్లు,  నర్సులు, నర్సింగ్‌ సిబ్బంది, సఫాయి కార్మికులు, అంబులెన్స్‌ డ్రైవర్లతో పాటు 50 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: