చంద్రబాబునాయుడు.. దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్.. ఆయన దాదాపు పాతికేళ్ల క్రితమే ఓ రాష్ట్రానికి సీఎంగా పని చేసిన వ్యక్తి.. 20 ఏళ్ల క్రితమే విజన్ 2020 అంటూ.. స్వర్ణాంధ్ర ప్రదేశ్ అంటూ కలలు కన్న వ్యక్తి. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాకుండా సీఈవోగా పని చేస్తున్నానని చెప్పుకున్న వ్యక్తి. అభివృద్ధి ప్రదాత అంటూ ఆనాటి మీడియాతో వేనోళ్ల పొగడబడిన వ్యక్తి. ఈ దేశానికి ప్రధాన మంత్రులను ఎంపిక చేసిన ఘనత కూడా ఆయన సొంతం.

ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు గురించి చాలా చెప్పుకోవచ్చు. అయితే ఓ నాయకుడికి గెలవడం ఎలా తెలుసా.. ఓడిపోయినప్పుడు తిరిగి పుంజుకోవడం కూడా తెలియాలి. ఓటమిని అంచనా వేసుకోవడం కూడా తెలియాలి.. అప్పుడే అసలైన నాయకుడు అవుతాడు. ఓసారి ఓడిపోయినా రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ గెలుపు బాటలో పయనిస్తాడు. అయితే ఇప్పుడు చంద్రబాబులో అలాంటి లక్షణాలు కనిపించడం లేదు. ఆయనకు వయస్సు పెరుగుతున్న కొద్దీ చాదస్తం కూడా పెరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎందుకంటే.. ఇటీవల సంక్రాంతి సంబరాల్లో మాట్లాడుతూ.. నన్ను ఎందుకు జనం ఓడించారో అర్థం కావడం లేదు.. అభివృద్ధి చేయడమే నేను చేసిన తప్పా.. అదే తప్పయితే నన్ను క్షమించండి అంటూ మాట్లాడారు. దీనిపై ఇప్పుడు వైసీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇక ఇలాంటి వాటిపై స్పందించడంలో ముందుండే వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయ సాయిరెడ్డి.. మరోసారి తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

చిత్తుగా ఓడిపోయి రెండేళ్లవుతున్నా ఎలా ఓడిపోయాడో  తెలియదంట సంక్రాంతి సృష్టికర్తనని చెప్పుకునే బాబు గారికి.  పైగా సారీ.. పూర్తిగా మారిపోయానంటూ కొత్త డ్రామాలు మొదలెట్టారు. ఎన్నిసార్లు మారతారు బాబు గారూ? దేవాలయాలు ధ్వంసం చేస్తూ తన ఓటమికి ఇంకా ప్రజల్నే నిందిస్తున్నాడని విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. అమూల్ రాకతో వరి పండించే రైతులే కాదు పాడి రైతులు కూడా  అదనపు ఆదాయంతో ఆనందంగా ఉన్నారు. మరి రాష్ట్రం ఇచ్చిన జీవోలను భోగిమంటల్లో వేయమంటారేంటి చంద్రబాబు గారూ? అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. హెరిటేజ్ కంపెనీ ఆదాయం తగ్గినా లక్షలాది రైతులకు లాభం జరిగిందిగా! రైతు బాగుపడితే మీకు అంత కడుపుమంట ఎందుకు? అంటూ విజ‌య‌సాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: