కరోనా  భయాలతో దూసుకెళ్లిన బంగారం ధరలు... మళ్లీ దిగివస్తున్నాయి. ఆల్‌టైమ్‌ హై నుంచి ఏకంగా 7 వేల రూపాయలకు పైగా తగ్గింది... 24 క్యారెట్ల పుత్తడి ధర. గత పది రోజుల్లో అయితే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర... 2 వేల 260 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం ఆర్నమెంట్‌ గోల్డ్‌ రేట్‌ తులం 45 వేల 740 రూపాయల దగ్గర ఉంది. అంతర్జాతీయ పరిణామాలతో పాటు... వరుసగా నాలుగు నెలల పాటు పెళ్లిళ్ల ముహూర్తాలు లేకపోవడంతో... పసిడికి డిమాండ్‌ అమాంతం పడిపోయింది. అందుకే బంగారం ధరలు దిగివస్తున్నాయని చెబుతున్నారు... మార్కెట్‌ నిపుణులు. వెండి ధర కూడా పతనం బాటలోనే ఉంది.

కరోనా వైరస్‌ నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం 1.9 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్రణాళికను అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించడంతో... డాలర్‌ విలువ బలహీనపడింది. అమెరికాలో కొద్దిరోజుల్లో రాజకీయంగా ప్రశాంత వాతావరణం ఏర్పడబోతుండటం, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్ల లాభాలు, పలుదేశాల్లో కరోనా టీకాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వైరస్‌ నియంత్రణలోకి వస్తుందని భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. బలహీనమైన డాలర్ కారణంగా బంగారం విలువ రోజురోజుకూ క్షీణిస్తోంది. అయితే కనిష్ట స్థాయిల్లో పసిడికి మద్దతు లభిస్తుందని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.

జనవరి ఆరో తేదీన 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర... 48 వేల రూపాయల దగ్గర ఉంది. జనవరి 7న 500, జనవరి 9న 1200 రూపాయలు తగ్గింది... తులం బంగారం ధర. జనవరి 11న మరో 400 రూపాయల తగ్గింది. ఆ తర్వాత జనవరి 12న 300 రూపాయలు పెరిగినా... నిన్న 450 రూపాయలు, ఇవాళ పది రూపాయలు తగ్గి... 45 వేల 740 రూపాయల దగ్గర ఉంది. మొత్తమ్మీద పది రోజుల వ్యవధిలో 2 వేల 260 రూపాయలు తగ్గింది... తులం బంగారం ధర. డాలర్‌ విలువ మరింత బలహీనపడితే... పుత్తడి ధర ఇంకా దిగివచ్చే అవకాశం ఉంది.

మరోవైపు బిట్‌కాయిన్‌ ధర దూసుకెళ్లడం కూడా బంగారం ధర తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. బంగారం కొనడానికి వినియోగించే డాలర్లన్నీ... బిట్‌కాయిన్‌ కొనుగోలుకు మళ్లిస్తుండటంతో... బంగారం కొనేవాళ్లు తగ్గిపోయారు. ఈ పరిణామం కూడా అంతర్జాతీయంగా గోల్డ్‌ రేట్‌ పతనానికి దారి తీసినట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: