దొంగతనమంటే నగలు, సొమ్ములు, విలువైన వస్తువులే కాదు.. మొక్కలను కూడా దొంగతనం చేస్తారని రుజువుచేశారు ఆ దొంగలు. అంతేకాదు మొక్కలు పోయినా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయవచ్చని ఆ యజమాని కూడా నిరూపించారు. మొక్కల దొంగలను కూడా పట్టుకుంటామని ఆ పోలీసులు పట్టుకుని చూపించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కోళ్లు, పెంపుడు శునకాలను అపహరించిన అరుదైన కేసుల గురించి చదివి ఉంటాము. కానీ మొక్కలను కూడా మాయం చేసినోళ్ల గురించి, అది కేసు వరకు వెళ్లడం బహుశా ఇప్పుడే వినుంటాం. అదేంటీ, మొక్కలను దొంగతం చేయడమేంటని అనుకుంటున్నారా.? నమ్మశక్యంగా లేదనుకుంటున్నారా.? కానీ ఇది హైదరాబాద్ నడిబొడ్డున నిజంగా జరిగింది. ఓ ఇద్దరు వ్యక్తులు కలిసి వలపన్ని మరీ ఓ మొక్కను దొంగిలించారు. ఇది గమనించిన ఆ యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా వేగంగా దర్యాప్తు చేపట్టి మరీ ఆ మొక్క దొంగలను పట్టేశారు.
                 రిటైర్డ్ డీజీపీ అప్పారావు జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నారు. ఆయనకు మొక్కల పెంపకం అలవాటు ఉంది. దీంతో దేశ విదేశాల్లోని వివిధ రకాల మొక్కలను తెచ్చి ఇంట్లో పెంచుకుంటున్నారు. ముఖ్యంగా ఖరీదైన  మొక్కలను కూడా పెంచుతున్నారు. అప్పారావు పెంచుకునే మొక్కల్లో దాదాపు లక్షన్నర రూపాయల విలువైన బోన్సాయ్ మొక్క ఒకటి ఉంది. రోజూ మొక్కలకు నీళ్లు పోసే తోటమాలి జనవరి 12న అప్పారావు తోటలో బోన్సాయ్ మొక్క లేకపోవడాన్ని గమనించాడు. వెంటనే యజమాని అప్పారావుకు విషయం తెలియజేశాడు. ఈ విషయమై జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో మాజీ డీజీపీ అప్పారావు పోలీసు కేసు నమోదు చేశారు. జూబ్లిహిల్స్ పోలీసులు ఆ పరిధిలోని సీసీ కెమెరాలను జల్లెడబట్టి మరీ బోన్సాయ్ మొక్కను దొంగిలించిన ఇద్దరినీ పట్టేశారు. అంతేకాదు ఆ మొక్కను కూడా వారి నుంచి స్వాధీన పరచుకుని అప్పారావుకు అందించారు. ఇదే విషయమై సోషల్ మీడియాలో ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: