ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని, మూడు రాజధానుల ప్రతిపాదన రద్దు చేసుకోవాలంటూ రాజధాని ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమం సినిమా రంగాన్ని టార్గెట్ చేసింది. టాలీవుడ్ హీరోలు అమరావతి ఉద్యమానికి మద్దతివ్వాలని డిమాండ్ చేశారు ఉద్యమకారులు. కనీసం తమ అభిప్రాయం అయినా చెప్పాలని కోరారు. దీనికి అసలు కారణం వేరే ఉంది. భూమి అనే తమిళ అనువాద సినిమాలో అమరావతి రైతుల ఉద్యమం గురించి ప్రస్తావించడంతో రైతులు.. తెలుగు సినీ రంగం మద్దతు కోసం ప్రశ్నిస్తున్నారు.

సంక్రాంతి రోజున కూడా అమరావతిలో నిరసనలు ఏమాత్రం తగ్గలేదు. శుక్రవారం ఆందోళనలు 395వ రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా సంప్రదాయ రీతిలో రైతులు ఆందోళన తెలియజేశారు. తమిళ అనువాద సినిమా ‘భూమి’లో అమరావతి రైతుల ఉద్యమం గురించి ప్రస్తావించినందుకు దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు రైతులు. తమ ఉద్యమానికి తెలుగు హీరోలు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. గురువారం 29 రాజధాని గ్రామాల్లోని శిబిరాల్లో రైతులు యథావిధిగా నిరసన దీక్షలు చేపట్టారు. చిన్నారులు హరిదాసుల వేషం వేసుకుని నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.

రైతు పక్షపాతినని చెప్పుకునే సీఎం జగన్‌, తన మనసు మార్చుకొని ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రాజధాని రైతులు డిమాండు చేశారు. సంక్రాంతి పండుగ నాడూ తాము రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. భూములిచ్చిన తమను చిన్నచూపు చూడడం తగదని అన్నారు ఉద్యమ కారులు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధాని గ్రామాలైన మందడం, వెలగపూడి, తుళ్లూరు, నెక్కల్లు, వెంకటపాలెం, బోరుపాలెం, రాయపూడి, పెదపరిమి, ఎర్రబాలెం తదితర చోట్ల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అమరావతి ఉద్యమంలో అశువులుబాసిన రైతులకు దొండపాడులో జోహార్లు అర్పించారు. మోతడక శిబిరం వద్ద రాజధానిని ముక్కలు చేయొద్దంటూ అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను ముగ్గురూపంలో వేశారు. ఉద్దండరాయునిపాలెం శిబిరం వద్ద కనుమ సందర్భంగా రైతులు గోపూజ నిర్వహించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: