ఏపీ, తమిళనాడు  అధికారుల మధ్య వార్ నడుస్తోంది. పర్మిట్లు, రికార్డులు సరిగా లేవనే కారణాలతో పోటీపడి ఏపీ బస్సులను తమిళనాడు, ఆ రాష్ట్ర బస్సులను ఏపీ ఆర్టీఏ అధికారులు సీజ్ చేస్తున్నారు. రెండు రాష్ట్రాల మోటార్‌ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు.. ఆర్టీసీ బస్సులను సీజ్‌ చేసుకుంటున్నారు.  నేపథ్యంలోనే తమిళనాడులోని వేలూరులో చిత్తూరు జిల్లాకు చెందిన మూడు బస్సులను అక్కడి ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు.  నాలుగు బస్సులకు పర్మిట్లు, రికార్డులు సక్రమంగా లేవంటూ సీజ్ చేశారు. దీంతో ఇవాళ తమిళనాడు ఆర్టీసీ బస్సులపై ఏపీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు.ఫలితంగా తమిళనాడు నుంచి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన ఆర్టీసీ బస్సులను ఏపీ అధికారులు సీజ్ చేశారు.


వాటి సంఖ్య మొత్తం 10 వరకు ఉంటుంది. చిత్తూరు జిల్లా కుప్పంలోనూ తమిళనాడుకు చెందిన మరో 10బస్సులను సీజ్ చేశారు. తమిళనాడులోని కృష్ణగిరిలో ఏపీకి చెందిన ఐదు బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. తమిళనాడు ఆర్టీసీ బస్సుల రికార్డులను పక్కాగా పరిశీలిస్తున్నారు ఎంవీఐ అధికారులు. ఏ ఒక్క రికార్డు లేకపోయినా వాహనాలను సీజ్ చేస్తామని పలమనేరు ఎంవీఐ అధికారులు తేల్చి చెబుతున్నారు. మొత్తానికి, ఆర్టీసీ బస్సులను సీజ్‌ చేయడంలో రెండు రాష్ట్రాల అధికారులు పోటీపోటీగా వెళ్తున్నారు. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ఏపీఎస్‌ఆర్టీసీ తమిళనాడుకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్న సంగతి తెలిసిందే.


బస్సులో పర్మిట్‌ లేదనే కారణంతో తిరుపతి డిపోకు చెందిన మూడు, చిత్తూరు డిపోకి చెందిన రెండు ఆర్టీసీ బస్సులను తమిళనాడు ఆర్టీఏ అధికారులు అడ్డుకున్న‌ట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులు చెప్పడంతో తమిళనాడు అధికారులతో చర్చలు జరపాలని మంత్రి అధికారుల‌కు ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశారు. మన ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడం వెనుక ప్రైవేటు ట్రావెల్స్‌ మాఫియా ప్రమేయం ఉందని భావించిన రవాణాశాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి తమిళనాడుకు చెందిన ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్‌పై తనిఖీలు ముమ్మరం చేసి 24 బస్సులను సరైన పర్మిట్లు లేవని నిలిపేశారు. ఈలోగా రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలప్రదం అయ్యాయి. దీంతో రెండు రాష్ట్రాల అధికారులు ఆర్టీసీ బస్సులను వదిలేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: