``బీజేపీతో పొత్తు కొన‌సాగించాలా ? వ‌ద్దా ?  త‌మ దారి తాము చూసుకోవాలా ?  ప్ర‌స్తుత ప‌రిస్థితి కొన‌సాగితే.. బీజేపీ త‌మ‌ను తొక్కేయ‌డం ఖాయం.. ఈ ప‌రిణామాల‌కు ఇప్ప‌టికైనా చెక్ పెట్టాలి !`` ఇదీ.. ఇప్పుడు జ‌న‌సేన‌లో సాగుతున్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌. ఎవ‌రిని క‌దిలించినా.. `పొత్తు వేస్ట్ బాస్‌`  అనే మాట‌లే వినిపిస్తున్నాయి. స‌రే! ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. త్వ‌ర‌లోనే తిరుప‌తి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. వైసీపీ ఎంపీ దుర్గా ప్ర‌సాద్ మ‌ర‌ణంతో దీనికి ఉప పోరు రానుంది. అయితే.. ఇక్క‌డ నుంచి పోటీ చేసి (గ‌తంలో చిరంజీవి ఇక్క‌డ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మెగా ఫ్యామిలీకి బ‌ల‌మైన కేడ‌ర్ కూడా ఉంది.) స‌త్తా చాటాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నారు. ఆ మాట‌కు వ‌స్తే తిరుప‌తి పార్ల‌మెంటు ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో బీజేపీ కంటే జ‌న‌సేన అభిమానులు, ప‌వ‌న్ సామాజిక వ‌ర్గ ఓట‌ర్లే ఎక్కువగా ఉన్నారు.

మ‌రోవైపు.. బీజేపీ ఏపీ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత‌.. సోము వీర్రాజు ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న పాలిటిక్స్ హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో.. తిరుప‌తి స్థానంలో బీజేపీ అభ్య‌ర్థిని నిల‌బెట్టి గెల‌వ‌డం లేదా.. క‌నీసం రెండో స్థానంలో నిల‌వ‌డం ద్వారా చేసి త‌న‌కు తిరుగులేద‌ని.. నిరూపించుకునేందుకు సోము వీర్రాజు తీవ్ర‌స్థాయిలో ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో బీజేపీ అభ్య‌ర్థినే ఇక్క‌డ నిల‌బెడ‌తామ‌ని ఆయ‌న అన‌ధికార ప్ర‌చారం చేస్తూ.. తిరుప‌తిలో ఏకంగా.. బీజేపీ పార్ల‌మెంట‌రీ ఆఫీసు కూడా ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్క‌డ ఎలాంటి స‌భ జ‌రిగినా.. తిరుప‌తిలో బీజేపీ గెలుపు త‌థ్య‌మ‌నే వ్యాఖ్య‌లు సోము నోటి నుంచి అల‌వోక‌గా వ‌స్తున్నాయి. దీంతో జ‌న‌సేన‌లో గ‌డ‌బిడ జ‌రుగుతోంది.

వాస్త‌వానికి కొన్నాళ్ల కింద‌ట తెలంగాణ‌లో జ‌రిగిన గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఎవ‌రినీ పోటీకి దింప‌లేదు. ఆదిలో 55 చోట్ల పోటీకి పెట్టాల‌ని అనుకున్నా.. త‌ర్వాత బీజేపీతో పొత్తులో ఉన్న నేప‌థ్యంలో ఆపార్టీకి స‌హ‌క‌రించేందుకు పోటీ నుంచి విర‌మించుకున్నారు. ఈ క్ర‌మంలోనే తిరుప‌తి పార్ల‌మెంటు స్థానాన్ని త‌మ‌కు ఇచ్చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. దీనిపై క‌మిటీ వేసిన బీజేపీ కేంద్ర పెద్ద‌లు విష‌యాన్ని నాన్చుతున్నారు.. అయితే.. చాప కింద నీరులా మాత్రం.. బీజేపీ తిరుప‌తిని టార్గెట్ చేసింది.

ఈ క్ర‌మంలో ఇక్క‌డ టికెట్ క‌నుక ఇవ్వ‌క‌పోతే.. బీజేపీతో క‌టీఫ్ చెప్పాల‌ని జ‌న‌సేన నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుంటే, ఈ నెల 21న ప‌వ‌న్ క‌ళ్యాణ్ తిరుప‌తి రానున్నారు.  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించిన కీలక విషయాలను చర్చించబోతున్నారు. ముఖ్యంగా తిరుప‌తిపై బీజేపీ వ్యూహాన్ని చ‌ర్చించి.. తాడో పేడో తేల్చుకునే దిశ‌గానే ప‌వ‌న్ అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: