ప్రపంచంలో 100కు పైగా దేశాల్లో జనాభా 3 కోట్లకంటే తక్కువే.. కానీ భారత్‌లో మొదటి దశలోనే 3 కోట్ల మందికి టీకా ఇస్తున్నాం.. రెండో దశలో 30 కోట్ల మందికి టీకాలు ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ కోసం పెద్ద ఎత్తున ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. వ్యాక్సిన్‌ కోసం శ్రమించిన శాస్త్రవేత్తలు, సంస్థలకు అభినందనలు తెలిపారు. నర్సులు, డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు తొలి హక్కు దారులని అన్నారు. వీరందరికీ ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.
                                             ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌కు చెందిన శాస్త్రవేత్తలు, సంస్థలు కీలక పాత్ర పోషించారని ప్రధాని మోదీ గుర్తుచేశారు. కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులను ఖచ్చితంగా తీసుకోవాలని ప్రధాని సూచించారు. టీకా వేసుకున్నా.. మాస్క్‌, సామాజిక దూరం పాటించాల్సిదేనని స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు ఖచ్చితంగా వేసుకోవాలని, తొలి డోసు, రెండో డోసుకు మధ్య నెల రోజుల సమయం పడుతుందన్నారు. రెండో డోసు వేసుకున్న తర్వాతనే.. కరోనాకు వ్యతిరేకంగా మీ శరీరంలో వ్యాధి నిరోదక శక్తి పెరుగుతుందని మోదీ తెలియజేశారు.
                                         టీకా వేసుకున్న తర్వాత కూడా మాస్కు, సామాజిక దూరం పాటించాల్సిందేనని ప్రధాని స్పష్టం చేశారు. అన్నీ రక్షణ చర్యలు చూసుకునే రెండు వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చామన్నారు. వ్యాక్సిన్‌పై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని, భారత్ ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో నమ్మకం ఉందని మోదీ భరోసా ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 60 శాతం మంది పిల్లలకు ఇస్తున్న పలు వ్యాక్సిన్లు భారత్‌వేనన్నారు. ఇతర దేశాల వ్యాక్సిన్ కంటే మన వ్యాక్సిన్లు చాలా చౌక, సులువైనదని తెలిపారు. ఈ వ్యాక్సిన్లు కరోనాపై పోరాటంలో భారత్‌కు విజయాన్ని అందిస్తాయని, సమస్య ఎంత పెద్దదైనా మనం ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: