అమరావతి: దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఆయన మరణం వెనుక భారీ కుట్ర ఉందంటూ కేరళలోని ప్రముఖ హక్కుల కార్యకర్త జోమున్ పుతెన్ పురక్కల్ చెప్పడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. జోమున్ ఇప్పటికే కేరళలో జరిగిన ఓ కుట్రపూరిత హత్య కేసులో పోలీసులకు ఎంతగానో సహకరించారు. ఆ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సిస్టర్‌ అభయ హత్య కేసులో తీవ్రంగా పోరాడి.. ఆమె హత్యకు సంబంధించి సీబీఐ సాక్ష్యాధారాలు సంపాదించడంలో జోమున్‌ కీలక పాత్ర పోషించారు. అలాంటిది ఇప్పుడు జోమున్ ఏకంగా వివేకా హత్య కేసు గురించి మాట్లాడడం సంచలనం సృష్టిస్తోంది.

శుక్రవారం ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జోమున్.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య వెనుక కొందరి హస్తం గురించి తనకు కచ్చితమైన అనుమానాలున్నాయని అన్నారు. రెండు నెలల్లో విలేకరుల సమావేశం నిర్వహించి.. మొత్తం సాక్ష్యాధారాలు బయటపెడతానని అన్నారు. ‘అనుమానితుల విషయంలో ఇప్పుడే మాట్లాడడం మంచిది కాదు. రోజుల క్రితం తనను వివేకా కుమార్తె సునీతారెడ్డి కలిశారు.
ఆమె తండ్రి మరణంపై సుదీర్ఘంగా చర్చించాం. సీబీఐ దర్యాప్తు విషయంలో ఆమెకు ఏ విధంగా సహాయం చేయాలి..? సాక్ష్యాధారాల సేకరణలో దర్యాప్తు సంస్థకు ఎలా తోడ్పడాలన్న విషయంపై కూడా మాట్లాడుకున్నాం. వివేకా కేసులో కూడా హంతకులకు కచ్చితంగా శిక్షపడేలా చేస్తాను’ అంటూ జోమున్ స్పష్టం చేశారు.

సిస్టర్‌ అభయ విషయంలో పోలీసులు ప్రజలను తప్పుదోవ పట్టించి.. ఆమెది ఆత్మహత్యగా చెప్పి కేసును మూసేయించే ప్రయత్నం చేశారని, కానీ ఆ కేసుపై తాను దర్యాప్తు చేసినప్పుడు అందులో కచ్చితంగా హత్యా కోణం ఉందని అనిపించిందని, అంతేకాకుండా అందులో చర్చి కీలక పాత్ర పోషించిందని భావించానని, అదే కోణంలో దర్యాప్తు చేసి సీబీఐకి సహకరించానని జోమున్‌ వెల్లడించారు.

ఈ ఘటనపై ప్రజల్లో చైతన్యం కలిగించి ఉద్యమ రూపం దాల్చేలా చేశానని, దీంతో సీబీఐ కూడా కేసును సీరియస్‌గా తీసుకుందని జోమున్ అన్నారు. అయితే తాను ఈ కేసులో చేస్తున్న దర్యాప్తు గురించి తెలుసుకున్న చర్చి ఫాదర్‌.. ఆయన సోదరుడితో తనపై హత్యాయత్నం కూడా చేశాడని, కానీ అదృష్టవశాత్తూ గాయాలతో బయటపడ్డానని జోమున్ తెలిపారు.

 చివరకు చర్చి ఫాదర్‌, నన్‌ కలిసి ఆమెను చంపారన్న విషయాన్ని సీబీఐ కోర్టు నిర్ధారించడంతో తనకు ఎంతో సంతోషం వేసిందని, ఎట్టకేలకు 28 ఏళ్ల తరువాత బాధితురాలికి న్యాయం జరిగడంతో పాటు నిందితులకు శిక్షపడడంతో తాను చాలా ఆనందపడ్డానని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: