కరోనా వైరస్ గోలతో 2020 ఏడాది అంతా గడచిపోయింది. ఇక 2021 వచ్చింది. ఇపుడు అందరిలోనూ కాస్తా కరోనా భయం అయితే తగ్గింది. ఎటు వైపు చూసినా మాస్క్ లేని మహారాజులే కనిపిస్తున్నారు. పెళ్ళిళ్ళు పేరటాలు అంటూ దర్జాగా తిరిగేస్తున్నారు. ఈ నేపధ్యంలో కరోనా టీకాలంటూ మళ్ళీ హడావుడి మొదలైంది.

కరోనా టీకాల అవసరం లేకుండా ఈ దేశంలో జనాలు కరోనాను బాగానే ఎదుర్కొన్నారు. కానీ భవిష్యత్తులో కరోనా మారుతున్న రూపాలను బట్టి చూస్తే కచ్చితంగా టీకాలు వేసుకుంటే మంచిదని కూడా వైద్య రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపధ్యంలో కరోనా టీకాలు భారత్ లో కూడా వచ్చేశాయి. వాటి పంపిణీ కూడా మొదలైంది. తొలి దశలో మూడు కోట్ల మందికి కరోనా టీకాలు ఇస్తారు.

ఆ తరువాత అంటే రెండవ దశలో మరో ముప్పయి కోట్ల మందికి ఇస్తారు. ఆ మీదట మిగిలిన వారు కచ్చితంగా వంద కోట్ల మందికి పై దాటి ఉంటారు. మరి వారి సంగతేంటి అన్నదే ఇక్కడ ప్రశ్న. ఈ దేశంలో 130 కోట్ల మందికి పై చిలుకు జనాభా ఉంది మరి వారికి కరోనా టీకా ఏ విధంగా అందుతుంది అన్నది మాత్రం ఎవరూ చెప్పడంలేదు.

ప్రధాని నరేంద్ర మోడీ కరోనా టీకాల పంపిణీ సందర్భంగా మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే మిగిలిన జనాభా కరోనా టీకాలను కొనుగోలు చేసుకోవాలేమో అన్న అనుమానాలు అయితే అందరిలో కలుగుతున్నాయి. ప్రధాని మాటలను బట్టి చూస్తే ప్రపంచంలో అన్ని దేశాల కన్నా భారత్ లో కరోనా టీకాలు చాలా చౌకగా లభిస్తున్నాయని చెప్పుకొచ్చారు. అంటే ప్రభుత్వం తన వంతుగా కరోనా టీకాలను తయారు చేయిస్తుంది. మార్కెట్ కి అనుమతులు ఇస్తుంది. ఆ మీదట కావాల్సిన వారు కొనుక్కోవాలేమోనని అంటున్నారు.

దీని మీదనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అయితే ఒక మాట అన్నారు. అందరికీ ప్రభుత్వమే కరోనా టీకాలు వేయించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం కనుక ఆ పని చేయకపోతే తామే కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా ఇస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. మరి మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆ విధంగా చేయాలేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: