రామబాణం అంటే తిరుగులేనిది అని చెబుతారు. రాముడు బాణం వదలాలే కానీ కచ్చితంగా లక్ష్యాన్ని చేరుతుంది. మరి రామభక్తుల‌ భక్తి బాణం అంతకు మించినది. ఏకంగా ఆ రామబాణాన్నే దాటి ముందుకు సాగుతోంది. ఇది పురాణాల్లో ఎన్నో సార్లు రుజువు అయింది. అధునిక  భారతాన ‌రాజకీయాల్లో చూస్తే కూడా ఇదే సూత్రం సూపర్ హిట్ అయింది కూడా.

ఉత్తర భారతాన రామబాణం పవర్ ఏంటి అని అడిగినే బీజేపీ చేతిలో ఓడిపోయిన పలువురు విపక్ష  నేతలు బుర్ర గోక్కుంటూ మరీ తాపీగా చెప్పాల్సినవి అన్నీ చెబుతారు. మరి దక్షిణాదిన రామబాణం ప్రభావం మూడు దశాబ్దాలకు ముందు ఇంతలా లేదు. కానీ ఇపుడు బీజేపీకి మోడీ లాంటి బలాడ్యుడు ప్రధానిగా ఉన్నారు. ఆయన పక్కన భీముడులా అమిత్ షా ఉన్నారు.

ఈ ఇద్దరూ కలిస్తే అసాధ్యాలను సుసాధ్యం చేస్తారని కూడా పేరు. ఉత్తరాదినే కాదు, ఈశాన్య భారతాన్ని కూడా కాషాయమయం చేసిన బీజేపీ పెద్దలు ఇపుడు తమ బాణాన్ని సౌత్ వైపు తిప్పారు. ఎలాగైనా ఈసారి దక్షిణాది బీజేపీ బుట్టలో పడాల్సిందేనని గట్టి వ్యూహాలే రూపొందించారు.

ఓ వైపు ఏపీలో మత రాజకీయాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ క్రిస్టియన్ మత విశ్వాసి అని హిందూ దేవతా విగ్రహాల మీద దాడులు వరసగా  జరుగుతున్నాయని ఓ వైపు టీడీపీ,మరో వైపు బీజేపీ గగ్గోలు పెట్టడం వెనక హిందూ కార్డు ప్రయోగమే ఉంది. ఇక ఇపుడు అయోధ్య రాముడి పేరు మీద విరాళాల సేకరణ పేరుతో ఏపీలో కావాల్సినంతగా రామజపాన్ని బీజేపీ చేస్తోంది.

అయోధ్యలో ఆలయానికి ఒక్క రూపాయి అయినా విరాళం ఇవ్వాలని కోరుతున్నారు. రామభక్తి నిరూపించుకోవాలని కూడా సూచిస్తున్నారు. మరి ఈ రోజు రూపాయలను విరాళంగా అడిగిన వారు రేపటి రోజున ఇదే రామభక్తితో హిందూ సమాజాన్ని ఏకం చేసి ఓట్ల పంట పండిచుకున్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇప్పటికే ఆ దిశగా బీజేపీ యాక్షన్ ప్లాన్ రెడీ అయిపోయిందని కూడా చెబుతున్నారు. మరి బీజేపీ రామబాణాన్ని ఎదుర్కోవడానికి వైసీపీ టీడీపీ లాంటి పార్టీలు సిధ్దంగా లేకపోతే రేపటి రోజున భారీ మూల్యం చెల్లించకతప్పదని వామపక్ష మేధావులు హెచ్చరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: