తెలంగాణ ఉద్యోగుల్లో మళ్లీ పీఆర్సీ ఆందోళన మొదలైంది. జనవరి రెండో వారంలోనే ఈ అంశానికి.. ప్రభుత్వం ఎండ్ కార్డ్ వేస్తుందనుకున్నారు. కానీ ఇప్పటి వరకు కదలిక లేకపోవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి మొదలైంది. కొన్ని సంఘాలు సైలెంట్ గా ఉన్నా... మరికొన్ని సంఘాలు మాత్రం గళం విప్పేందుకు సిద్ధమయ్యాయి.

తెలంగాణ ఉద్యోగులకు నూతన సంవత్సర కానుకగా పీఆర్సీ ఉంటుందని అనుకున్నారు. కానీ వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. పీఆర్సీ కమిటీ నివేదిక ఇవ్వగానే ఉద్యోగ సంఘాలతో సమావేశాలు... ఆ వెంటనే అన్నీ చక చక అయిపోతాయి అని చెప్పింది సర్కార్. కమిటీ నివేదిక అయితే ఇచ్చింది కానీ.. నివేదికలోని అంశాలు ఇప్పటికీ పబ్లిక్ డొమైన్ లోకి రాలేదు.

పీఆర్సీ కమిటీ నివేదిక ఇచ్చి పదిహేను రోజులు గడిచినా... సిఫారసులను పబ్లిక్ డొమైన్ లో ఉంచకపోవడంతో ఉద్యోగ సంఘాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనవరి మొదటివారంలోనే ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు చేపడుతాం అని చెప్పిన ప్రభుత్వం... ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం చేయలేదు. దీంతో ఈ ప్రాసెస్ మరింత ఆలస్యం అయ్యేలా ఉందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.

ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. దీంతో.. పీఆర్సీ నివేదిక వెల్లడించాలి.. సంఘాలతో వెంటనే చర్చలు ప్రారంభించాలంటూ ఉద్యోగుల ఐక్యవేదిక డిమాండ్ చేస్తోంది. జనవరి 23 న ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు నిరాహారదీక్షకు సిద్ధమయ్యారు.  

ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా హైదరాబాద్ ధర్నా చౌక్ లో దీక్ష చేపట్టేందుకు సిద్ధమయ్యారు ఐక్యవేదిక రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు. అలాగే కలెక్టరేట్ల ఎదుట,  మండల కేంద్రాల్లో, విద్యాసంస్థల్లో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

ఐక్యవేదిక ఆందోళన చేపడుతామని ప్రకటించింది. కానీ.. మిగిలిన ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం నుండి సానుకూల ప్రకటన వస్తుందనే ఆలోచనలో ఉన్నాయి. అయితే ప్రభుత్వం నిర్ణయించిన కమిటీ సభ్యులు కలెక్టర్ల సమావేశాల్లో... కరోనా వ్యాక్సిన్ లాంటి పనుల్లో నిమగ్నంకావడంతోనే..  పీఆర్సీ నివేదికకు సంబంధించిన అంశంలో జాప్యం జరుగుతోందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: