న్యూఢిల్లీ: రాజ్యసభ కార్యకలాపాల్లో ఇంగ్లిష్, హిందీలను ఎక్కువగా ఉపయోగిస్తారు. హిందీ కాకుండా మిగిలిన 21 షెడ్యూల్డు భారతీయ భాషలను వినియోగించడం 2004-2017 మధ్య కాలంతో పోల్చుకుంటే 2020లో ఒక్కొక్క సిటింగ్‌కు 512 శాతం పెరిగింది. ఈ విధంగా ప్రాంతీయ భాషల వినియోగం పెరగడానికి ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడే కారణమని తెలుస్తోంది. ఆయన అందిస్తున్న ప్రోత్సాహంతో సభ్యులు ప్రాంతీయ భాషల్లో ప్రసంగిస్తున్నారు. 2018-2020 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యులు సభలో తమ మాతృభాషలో ప్రసంగిస్తుండటం ఐదు రెట్లు పెరిగింది.

1952లో రాజ్యసభ ప్రారంభమైన తర్వాత తొలిసారి 2018-2020 మధ్య కాలంలో డోగ్రి, కశ్మీరీ, కొంకణి, సంతాలీ భాషలను సభ్యులు ఉపయోగించారు. అస్సామీస్, బోడో, గుజరాతీ, మైథిలి, మణిపురి, నేపాలీ భాషలను సభ్యులు రాజ్యసభలో వినియోగించడం చాలా కాలం తర్వాత ఈ మూడేళ్ళలోనే జరుగుతోంది. 2004 నుంచి 2017 మధ్య కాలంలో రాజ్యసభలో 923 సిటింగ్స్‌లో 269 సందర్భాల్లో షెడ్యూల్డు భాషల్లో హిందీయేతర 10 భాషలను సభ్యులు ఉపయోగించారు. అంటే ఒక్కొక్క సిటింగ్‌కు సగటున 0.291 రేటుతో ప్రాంతీయ భాషలను ఉపయోగించారు. 2020లో 33 సిటింగ్స్‌లో ప్రాంతీయ భాషల్లో 49సార్లు మాట్లాడారు. అంటే 1.49 రేటుతో ప్రాంతీయ భాషల్లో సభ్యులు మాట్లాడారు. దీంతో ప్రాంతీయ భాషల వినియోగం 512 శాతం పెరిగింది.

2013-17 మధ్య కాలంలో 329 సిటింగ్స్ జరిగాయి. ఈ కాలంలో తమిళం 32సార్లు, తెలుగు 19సార్లు, ఉర్దూ 19సార్లు, బెంగాలీ ఆరుసార్లు, మరాఠీ మూడుసార్లు, ఒడియా ఐదుసార్లు, కన్నడ రెండుసార్లు, పంజాబీ రెండుసార్లు, మలయాళం రెండుసార్లు వినియోగించారు. 2018-20 మధ్య కాలంలో 163 సిటింగ్స్ జరిగాయి. ఈ కాలంలో తెలుగు 33 సార్లు, తమిళం 18సార్లు, ఉర్దూ 24సార్లు, బెంగాలీ 16సార్లు, సంస్కృతం 12సార్లు, మరాఠీ ఆరుసార్లు, ఒడియా ఆరుసార్లు, కన్నడ ఐదుసార్లు, పంజాబీ మూడుసార్లు, అస్సామీస్ రెండుసార్లు వినియోగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: