కులం, మతం, ప్రాంతం అనే భేదం లేకుండా అందరూ సామరస్యంగా జీవించాలనేది వైసీపీ ప్రభుత్వ ఉద్దేశ్యమని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా దేవతా విగ్రహాలను విరగకొట్టే దుస్సంఘటనలు, దేవాలయాలపై చీకట్లో దాడులు జరుగుతూ వచ్చాయని అంబటి తెలిపారు. ఘటనలపై కొన్ని వార్తాపత్రికలు, కొన్ని ఛానళ్లు .. కొన్ని అవాస్తవాలను వాస్తవాలుగా చీత్రీకరించే ప్రయత్నం చేశాయని అన్నారు. కొన్ని చోట్ల దాడులు జరగటం, విగ్రహాలను అవమానించటం, విగ్రహాలను విరిచి వేయటం వంటి సంఘటనలు జరిగాయన్నారు. అయితే జరగని సంఘటనలు కూడా జరుగుతున్నట్లుగా చూపించి, రాష్ట్రంలో ఒక గందరగోళం సృష్టించటానికి కొన్ని పత్రికలు, కొన్ని శక్తులు ప్రయత్నం చేసినట్లుగా మనకు అర్థమౌతోందని అంబటి అన్నారు. ఇటువంటి చర్యల ద్వారా మత సామరస్యాన్ని చెడగొట్టి మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం కొన్ని దుష్టశక్తులు చేశాయి.
                                               జగన్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలన్న కుట్ర బుద్ధితో ఇటువంటి ప్రయత్నాలు చేశారని అంబటి ఆరోపించారు. అధికారంలోకి రాలేనని భావించిన చంద్రబాబు మొన్నటి వరకు కులాన్ని, ప్రాంతాన్ని అడ్డంపెట్టుకొని రాజకీయం చేశారని,  ఇవాళ మతాల మధ్య చిచ్చు పెట్టి పోయిన అధికారాన్ని దక్కించుకోవాలనే విషప్రయత్నం చంద్రబాబు చేస్తూ వచ్చారని అంబటి అన్నారు. నిజం చెప్పాలంటే ఈ 13 జిల్లాలు కలిపిన రాష్ట్రం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిందని, ఎక్కడా మతాల మధ్య ఎప్పుడూ గొడవలు లేవని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌లో కొంత మతవిధ్వేషాలు అప్పడప్పుడు రగిలేవని కానీ ఆంధ్రా ప్రాంతంలో మతాల మధ్య సామరస్యమే తప్ప ఘర్షణ వాతావరణం ఎప్పుడూ లేదని అంబటి గుర్తు చేశారు.
                                  చంద్రబాబు, అచ్చెన్నాయుడు, టీడీపీ తాబేదార్ల ప్రకటనలతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు కనిపిస్తోందని రాంబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువులు అందరూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ వచ్చారు తప్ప ఏనాడూ ద్వేషించుకున్నది లేదని అంబటి అన్నారు. అలాంటి ఈ పవిత్రమైన రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చుపెట్టాలనే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేయటం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నానని అంబటి తెలిపారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్‌ ద్వారా తెల్సిన వాస్తవాలను డీజీపీ చెప్పే ప్రయత్నం చేశారు. దీని తర్వాత టీడీపీ, బీజేపీ గొంతులో వెలక్కాయ పడినట్లు అయిందని, అందుకే ఏం మాట్లాడాలో వారికి అర్థం కాని పరిస్థితి వచ్చిందని అంబటి అన్నారు. 44 కేసులు ఇన్వెస్టిగేషన్‌ చేస్తే 29 కేసుల్లో వాస్తవాలను గ్రహించే అవకాశం పోలీసులకు కలిగిందని అంబటి అన్నారు. దీంట్లో టీడీపీ, బీజేపీ వారు కలిసి చేశారనే భావన వచ్చే విధంగా వాస్తవాలు బయటకు వచ్చాయని అంబటి రాంబాబు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: