శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎంపీగా ఓ వైపు పార్లమెంట్‌లో రాష్ట్ర సమస్యలపై గట్టిగానే గళం విప్పుతున్న రామ్మోహన్...టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రంలోని అధికార వైసీపీపై పోరాటం చేస్తున్నారు. టీడీపీ అధికారం కోల్పోయాక, చంద్రబాబుకు అండగా ఉంది కింజరాపు ఫ్యామిలీనే. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులు పార్టీ తరుపున గట్టిగా కష్టపడుతున్నారు.

అయితే మధ్యలో అచ్చెన్న జైలుకు వెళ్ళాక రామ్మోహన్ కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించారు. కానీ అచ్చెన్న బయటకొచ్చాక, బాబు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి ఇచ్చారు. దీంతో అచ్చెన్న జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. తన బాబాయ్‌కు తగ్గట్టుగానే రామ్మోహన్ కూడా వైసీపీపై దూకుడుగా వెళుతున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా స్థాయిలో రామ్మోహన్ టీడీపీని బలోపేతం చేస్తూ, వైసీపీపై విరుచుకుపడుతున్నారు.

అలాగే జిల్లాలోని మంత్రి అప్పలరాజుని రామ్మోహన్  టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. మంత్రి టీడీపీపై నిత్యం ఏదొరకంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. మొన్న ఆ మధ్య గౌతు లచ్చన్నని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని,  టీడీపీ నేతలు మండిపడ్డారు. అలాగే రామ్మోహన్ సైతం, మంత్రిపై విరుచుకుపడుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. జిల్లాలో మంత్రిని దెబ్బకొట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదే సమయంలో అప్పలరాజు కూడా టీడీపీని టార్గెట్ చేసుకుని, ఇబ్బందులు పెడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో తనపై పోస్టులు పెట్టారని, ఓ టీడీపీ కార్యకర్తని అరెస్ట్ చేయించారని వార్తలు వచ్చాయి. దీనిపై రామ్మోహన్ పోరాటం చేస్తున్నారు. మంత్రి చెప్పారని, పోలీసులు అర్ధరాత్రి వచ్చి తమ కార్యకర్తని స్టేషన్‌కు తీసుకెళ్లారని, అక్రమ కేసులు కూడా పెట్టారని రామ్మోహన్ ఫైర్ అవుతున్నారు.
పోలీసులు సైతం ఈ కేసు విషయంలో పెద్ద క్లారిటీ ఇస్తున్నట్లు కనిపించడం లేదు. పైగా ఆ టీడీపీ కార్యకర్త అక్రమ మద్యం అమ్ముతూ దొరికాడని చెబుతున్నారు. కానీ రామ్మోహన్ మాత్రం, ఇవి అక్రమ కేసులని, మంత్రి చెప్పారనే ఇలా జరుగుతుందని మండిపడుతున్నారు. అయితే ఈ విషయంలో మంత్రికే కాస్త నెగిటివ్ వచ్చేలా ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మొత్తానికైతే రామ్మోహన్, అప్పలరాజుని వదిలేలా కనిపించడం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: