టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డీజీపీ టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. హైందవమతంపై దాడులకు సంబంధించిన ప్రస్తావనలో దోషులను  అరెస్ట్ చేసినట్లు చెప్పిన డీజీపీ, పార్టీల ప్రమేయం ఉందని చెప్పడం రాష్ట్రప్రజానీకాన్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది అని అన్నారు. డీజీపీ ఏ సమాచారంతో మీడియా వారితో మాట్లాడారు?  అని నిలదీశారు. సీఐడీ, సిట్ సంస్థలు ఇచ్చిన సమాచారంతోనా లేక సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన సమాచారంతో మాట్లాడారా? అని ఆయన ప్రశ్నించారు.

13 వ తేదీన మాట్లాడిన డీజీపీ ఏ పార్టీకి సంబంధం లేదని చెప్పి, 15వ తేదీన మాట్లాడుతూ, రాజకీయ పార్టీలకు సంబంధించినవారి ప్రమేయం ఉందని చెప్పడం సిగ్గుచేటు అని ఆయన ఆరోపించారు. ఏ డీజీపీ కూడా మాట్లాడని విధంగా ఆయన అధికారపార్టికి వత్తాసుపలుకుతూ దిగజారి మాట్లాడారు అని మండిపడ్డారు. ఆంజనేయస్వామి విగ్రహం చేతిని విరగ్గొట్టినవారు, రథాలు తగలబెట్టినవారు, రామతీర్థంలో రాముని తల పగలగొట్టినవారి సంగతేమిటో డీజీపీ చెప్పాలి అని డిమాండ్ చేసారు.

హైందవమతాన్ని కించపరుస్తూ, ఆంజనేయస్వామి విగ్రహంచేయి విరిగితే ఏమవుతుంది... రాముడి తల తెగితే రక్తమొస్తుందా అంటూ అవహేళనగా మాట్లాడిన బూతుల మంత్రి కొడాలినానీ, డీజీపీకి నేరస్తుడిలా కనిపించలేదా? అని నిలదీశారు. కర్నూలు జిల్లాలోని ఓంకారక్షేత్రంలో  అర్చకులను చర్నాకోలుతో చావబాదిన ప్రతాపరెడ్డిని డీజీపీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని నిలదీశారు. ఆంజేయస్వామి దేవాలయాన్ని జేసీబీతో కూల్చేసిన దామోదర్ రెడ్డి, డీజీపీ ప్రకటించిన హిందూద్రోహుల జాబితాలో ఎందుకు లేడు? అని ప్రశ్నించారు. వైసీపీవారిని వదిలేసి, దోషులను పట్టుకున్నామని, రాజకీయపార్టీలప్రమేయం ఉందని డీజీపీ ఎలా చెబుతారు? అని ప్రశ్నించారు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి తనకు తానే హిందూ దేవాలయాలపై దాడిచేశానని, విగ్రహాలను ధ్వంసం చేశానని, 699 గ్రామాలను క్రైస్తవ గ్రామాలుగా మార్చానని చెబితే, డీజీపీ అతన్ని ఎందుకు మీడియాముందు ప్రవేశపెట్టలేదు అని ప్రశ్నించారు. డీజీపీ వ్యాఖ్యలను, ఆయన విధినిర్వహణ తీరుని ఐపీఎస్ అధికారుల సంఘం కూడా సమర్థించదు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: