విజయనగరం: ఆంధ్ర ప్రదేశ్ లో కలకలం రేపిన రామతీర్థం విగ్రహాల ధ్వంసం వివాదం మరో మలుపు తిరిగింది. ఇక్కడ దుండగుల దాడిలో ధ్వంసమైన శ్రీరాముని విగ్రహం పునర్నిర్మాణం కోసం టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు లక్ష రూపాయల చెక్కు పంపిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో ఆయనకు దేవాదాయ శాఖ షాక్ ఇచ్చింది. ఆయన పంపిన చెక్కును తిరిగి అశోక్ గజపతి రాజు ఇంటికే పంపించింది. ఇదేంటని ఆయన ప్రశ్నించగా.. రామతీర్థంలో ధ్వంసమైన విగ్రహం స్థానంలో కొత్త విగ్రహం తయారు చేసే బాధ్యతను తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుందని రాష్ట్ర దేవాదాయశాఖ అశోక్ గజపతిరాజుకు తెలిపింది. కాబట్టి ఆయన పంపిన చెక్కును తిరిగి పంపింది. ఈ మేరకు ఆయన పంపిన చెక్కుతో పాటు ఓ లేఖను పంపింది.

 ప్రభుత్వం‌పై ట్విట్టర్ వేదికగా టీడీపీ నేత అశోక్‌ గజపతి రాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘మొదట నాకు నోటీసు కూడా ఇవ్వకుండా అనువంశిక ధర్మకర్తగా తొలగించారు. ఇది ఎండోమెంట్ యాక్ట్ సెక్షన్ 28కు తూట్లు పొడవడమే. అసలు నోటీసు కూడా లేకుండా నన్ను ఎలా తొలగించారు? దీనికి వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఓ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడిగా శ్రీ రాముని కొత్త విగ్రహాల తయారీ కోసం చేసిన సాయాన్ని కూడా నిరాకరించారు. విగ్రహాల పునర్నిర్మాణం నిమిత్తం నేను భక్తి పూర్వకంగా ఇచ్చిన కానుకను తిరస్కరించడం బాధాకరం. చూడబోతే వ్యవస్థాపక కుటుంబాన్ని దేవస్థానాలకు దూరం చేసే ఉద్దేశ్యంలో ఈ ప్రభుత్వం ఉన్నట్లుగా అనిపిస్తోందని’’ అశోక్‌ గజపతి రాజు ట్వీట్ చేశారు. ఇలా అశోక్ గజపతి రాజు పంపిన చెక్కును దేవాదాయ శాఖ తిరస్కరించడంపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇది కచ్చితంగా ప్రభుత్వ కక్షసాధింపు చర్యేనని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఈ విమర్శలకు అసలు అర్థమే లేదని ప్రభుత్వం వాదిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: