దేశ వ్యాప్తంగా తొలి రోజు కోవిడ్ వ్యాక్సినేషన్ విజయవంతమైంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఏక కాలంలో ప్రారంభమైన టీకా పంపిణిలో తొలి రోజు లక్షా 65 వేల 714 హెల్త్ వర్కర్లు టీకా తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.  కరోనా టీకా పంపిణిలో ఎక్కడా ఎలాంటి ఆందోళనకర పరిణామాలు సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

         అయితే కోవిడ్ వ్యాక్సిన్ సమర్ధతపై అనుమానాలు మాత్రం తగ్గడం లేదు. దేశంలో కోవిడ్ టీకా పంపిణి ప్రారంభమైనా కొందరు ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ పై చాలా మందిలో అపోహలు ఉన్నాయని... అవి తొలగి పోవాలంటే ప్రధాని మోడీ వ్యాక్సిన్ వేయించుకోవాలని మహారాష్ట్ర నేత, వంచిత్ బహుజన్ అఘాడి నాయకుడు ప్రకాశ్ అంబేద్కర్ సూచించారు. వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా ప్రజల సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని ఆయన చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు ప్రకాష్ అంబేద్కర్.

      ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కు డిమాండ్ పెరుగుతోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని, ప్రపంచ హితం కోసం వ్యాక్సిన్ ను ఎగుమతి చేస్తామని చెప్పారు. కరోనా వల్ల ఒక్క రోజులోనే ప్రతి ఒక్కటీ మూత పడుతుందని ఏ ఒక్కరూ ఊహించలేదని రాజ్ నాథ్ అన్నారు. మహమ్మారిని మన ప్రధాని మోడీ ఒక సవాల్ గా తీసుకున్నారని... వరుస సమీక్షలు నిర్వహిస్తూ పరిస్థితిని అదుపులో ఉంచారని రాజ్ నాథ్ సింగ్ కితాబిచ్చారు.
సర్వేజనా సుఖినోభవంతు అనే సిద్ధాంతాన్ని మనం నమ్ముతామని... అశోక చక్రవర్తి కాలం నుంచి ఇప్పటి వరకు మనుషులతో పాటు సర్వ జంతుజాలం పట్ల ఇదే కరుణను చూపిస్తున్నామని అన్నారు. ఈ కరోనా క్లిష్ట సమయంలో కూడా మన సిద్ధాంతాలను అనుసరిస్తూ వ్యాక్సిన్ ను ఇతర దేశాలకు కూడా అందిస్తామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: