రాష్ట్రంలో ఆలయాలపై దాడులను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అన్ని దేవాలయాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవాలయాలను మాపింగ్ చేయడంతో పాటు సీసీ కెమేరాలు కూడా ఏర్పాటు చేశారు.  దాడులకు సంబంధించిన కేసులను విచారించేందుకు స్పెషల్ టీంలను రంగంలోకి దింపి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో తెలుగుదేశం, బీజేపీ పార్టీలకు చెందిన నేతల పాత్రను గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. దాదాపు తొమ్మిది విగ్రహాల ధ్వంసంతోపాటు తప్పుడు ప్రచారం చేసిన కేసుల్లో టీడీపీ, బీజేపీ నేతల ప్రమేయం ఉన్నట్లు తేల్చారు. ఈ కేసుల్లో మొత్తం 21మంది ప్రమేయం ఉందని నిర్దారించారు. ఈ కేసుల్లో 17మంది టీడీపీ నేతల్లో 13మందిని గుర్తించి అరెస్ట్ చేశారు. మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారు. ఇక బీజేపీకి సంబంధించి నలుగురు దాడులు చేసినట్లు గుర్తించారు. వీరిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనల విచారణలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఘటనల్లో కొన్నిటిలో తెలుగుదేశం, బీజేపీ పార్టీల నేతల పాత్ర ప్రమేయాన్ని గుర్తించారు. దీంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. నాలుగు నెలలుగా వరుసగా దేవాలయాలపై దాడుల ఘటనపై కేసులు నమోదు అవుతున్నాయి. దాడులు చెయ్యడమే కాకుండా అసత్య ప్రచారం కూడా చేస్తున్నట్టు గుర్తించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నారని పోలీసులు తెలిపారు. అయితే వరుసగా విగ్రహాలు ధ్వంసం చేయడంతో పాటు తప్పుడు ప్రచారం జరుగుతోందని చెబుతున్న పోలీసులు.. ఆ దిశగా విచారణ ముమ్మరం చేశారు.

రాష్ట్రంలో మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికే తెలుగుదేశం బీజేపీ నాయకులు విగ్రహాల ధ్వంసం జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేశారని పోలీసులు చెబుతున్నారు. విగ్రహాల ధ్వంసం, తప్పుడు ప్రచారానికి సంబంధించి తెలుగుదేశం, బీజేపీనేతల ప్రమేయం ఉన్నట్లు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: