ఇండోనేషియాను భారీ భూకంపం కుదిపేసింది. సులవేసి దీవిలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదయ్యింది. భూకంప తీవ్రతకు పలు భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. ఇండోనేషియా భూ కంపం మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇంత వరకూ 67 మంది చనిపోగా, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లను రక్షించేందుకు సహాయ బృందాలు కృషి చేస్తున్నాయి.

ఇండోనేషియాలోని సులవేసి దీవిలో కేవలం ఏడు సెకన్ల పాటు వచ్చిన భూకంపం అపార ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. 6.2 తీవ్రతో వచ్చిన భూకంపానికి మముజు, మజేనీ నగరాల్లో 62 భవనాలు కుప్పకూలాయి. 300కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. తెల్లవారు జామున అంతా గాఢ నిద్రలో ఉండగా భూకంపం రావడంతో ప్రాణ నష్టం అధికంగా ఉందంటున్నారు అధికారులు. కూలిన భవనాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.     

భూకంప కేంద్రాన్ని మజేనీలో పది కిలో మీటర్ల లోతున ఉన్నట్టు గుర్తించారు అధికారులు. భూకంపం రావడంతో వేలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లను వదలి పరుగులు తీశారు. శిథిలాలను తొలగించే కొద్దీ మృత దేహాలతో పాటు కొంత మంది ప్రాణాలతో బయటపడుతున్నారు.     

శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లను రక్షించడమే లక్ష్యంగా సహాయ చర్యలు జరుగుతున్నాయి. ఇందులో రెడ్ క్రాస్‌ బృందాలు కూడా పాల్గొంటున్నాయి. 2018లో కూడా సులవేసి దీవిలో భూకంపం వచ్చింది. 6.2 తీవ్రతతో భారీ భూకంపం రావడంతో పాటు సునామీ వచ్చింది. దీంతో వేలాది మంది చనిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: