ఏపీలో రాజకీయంగా ఎదురవుతున్న అన్ని ఇబ్బందులను అధిగమించేందుకు బీజేపీ-జనసేన పార్టీలు ఉమ్మడిగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు పొత్తు పెట్టుకున్నాయి. వైసీపీ ప్రభుత్వం పైన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పైన పోరాటం చేస్తూ క్రమంగా బలం పెంచుకునే ఉద్దేశ్యంలో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్న మొదటి నుంచి అనేక అనుమానాలు జనాల్లో మొదలయ్యాయి. అప్పుడప్పుడు మాత్రమే ఉమ్మడిగా పోరాటాలు చేస్తున్నాయే తప్ప , మిగతా సమయంలో ఎవరికి వారే సొంతంగా బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండటం,  ఎవరికి వారు తామే గొప్ప అన్నట్లుగా వ్యవహరిస్తున్న వంటి కారణాలతో ఈ రెండు పార్టీల పొత్తు పై ఆ పార్టీల నాయకులకు నమ్మకం లేకుండా ఉంది. దీనికి మరింత ఆజ్యం పోస్తూ తిరుపతి ఉప ఎన్నికల వ్యవహారంలో ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలను కలిగిస్తోంది. 





అసలు జనసేన ప్రమేయం లేకుండానే తిరుపతి ఉప ఎన్నికలలో జనసేన బలపరిచిన బిజెపి అభ్యర్థి పోటీ చేస్తారు అంటూ సోము వీర్రాజు ప్రకటించిన దగ్గర నుంచి జనసేన వైఖరి మరింతగా మారింది. జనసేన సైతం ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దించాలని చూస్తోంది. దీనిలో భాగంగానే ఈనెల 21వ తేదీన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.




ఈ సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు రాజకీయ వ్యవహారాలు కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నారు. అవసరమైతే ఆ సమావేశంలోనే జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థి పేరును సైతం ప్రకటించేందుకు జనసేన సిద్దమవుతుండటంతో ఈ రెండు పార్టీల పొత్తు పై అనేక అనుమానాలు నెలకొంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: