హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైపోయింది. చాలా దేశాల్లో ఇప్పటికే లక్షలాది మందికి కరోనా వ్యాక్సిన్ డోస్‌లను ఇచ్చేశారు. వ్యాక్సిన్ డోస్ తీసుకున్న కొంత మందికి సైడ్ ఎఫెక్ట్స్ వంటివి కూడా వచ్చాయి. అయితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తే తమకు సంబంధం లేదని కొన్ని వ్యాక్సిన్ కంపెనీలు ముందుగానే హామీ పత్రం వంటివి రాయించుకుంటున్నాయి. మరి కొన్ని కంపెనీలు మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ వస్తే పూర్తి బాధ్యత తమదేనని, నష్ట పరిహారం కూడా చెల్లిస్తామని చెబుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ విషయానికి వస్తే.. ఈ సంస్థ కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ను తయారుచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సంస్థకు చెందిన వ్యాక్సిన్ ఇచ్చే ముందుగానే లబ్ది దారుల నుంచి అంగీకార పత్రం తప్పని సరిగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.

కోవాగ్జిన్ టీకాను కేవలం క్లినికల్ ట్రయల్స్ మోడ్‌లో మాత్రమే తీసుకునేందుకు డీసీజీఐ అనుమతిని ఇవ్వడం కారణంగానే అంగీకార పత్రాన్ని తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ఈ హామీ పత్రంలో తమ వ్యాక్సిన్ డోస్ వల్ల లబ్దిదారునికి ఎటువంటి హాని జరిగినా దానికి పూర్తి బాధ్యత తమదేనని, లబ్దిదారుడికి అవసరమైన పూర్తి చికిత్సను తామే అందిస్తామని భారత్ బయోటెక్ హామీ ఇచ్చింది. అయితే ఇదే ఒప్పందంలో ఇండెమ్నిటీని కూడా చేర్చాలని భారత్ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాయి.

ఇండెమ్నిటీ అంటే ఏంటంటే.. స్పష్టంగా చెప్పాలంటే ఇదో చట్టపరమైన క్లెయిమ్‌ల నుంచి లభించే బీమా అని చెప్పాలి. టీకా వేయించుకున్న వారిలో అనుకోకుండా ఏవైనా తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తినప్పుడు వారు నష్టపరిహారం కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తుంటారు. ఈ సమయంలో ఒకవేళ టీకా కంపెనీలకు ప్రభుత్వం ఇండెమ్నిటీని వర్తింపజేస్తే.. అప్పుడు కోర్టులను ఆశ్రయించే బాధితులకు పరిహారాన్ని ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టే టీకా కంపెనీలు హామీ పత్రంలో ఇండెమ్నిటీని చేర్చాలని కోరాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: