సంక్రాంతి సెలవల తర్వాత ఏపీలో స్కూళ్లు, కాలేజీలు నేటినుంచి తిరిగి మొదలయ్యాయి. అయితే ప్రైమరీ సెక్షన్ విషయంలో ఏపీ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేకుండా ఉంది. ఈ ఏడాదికి ప్రైమరీ సెక్షన్ ని పూర్తిగా రద్దు చేసి, అందరినీ ప్రమోట్ చేయాలా? లేక చివరిలో నెలరోజులైనా తరగతులు నిర్వహించాలా అనే విషయంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి సంక్రాంతి సెలవల తర్వాత 1నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులను స్కూళ్లకు హాజరు కావాలని ప్రభుత్వం సూచిస్తుందని అనుకున్నారంతా. కానీ ఆ నిర్ణయంపై సర్కారు వెనకడుగు వేసింది.

కరోనా కారణంగా మూతబడిన స్కూళ్లు.. ఈ విద్యా సంవత్సరం 5 నెలలు ఆలస్యంగా నవంబర్‌ 2వ తేదీ నుంచి మొదలయ్యాయి. మొదట్లో 9, 10 తరగతులు, ఇంటర్ క్లాసులు నడిపిన విద్యాశాఖ తర్వాత 6, 7, 8 తరగతుల విద్యార్థులను కూడా అనుమతించింది. వీరంతా సంక్రాంతి సెలవల తర్వాత తిరిగి స్కూళ్లు, కాలేజీలకు హాజరవుతున్నారు. అయితే ప్రాథమిక పాఠశాలల విషయంలోనే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. టీచర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బదిలీలను సంక్రాంతి సెలవుల్లో విద్యాశాఖ పూర్తిచేసింది. దాదాపు 76 వేల మంది టీచర్లకు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో సోమవారం నుంచి కొన్నిచోట్ల కొత్త టీచర్లతో స్కూళ్లు ప్రారంభమయ్యాయి.

మధ్యాహ్నం వరకు ఆఫ్ లైన్.. ఆ తర్వాత ఆన్ లైన్..
పాఠశాలల నిర్వహణకు సంబంధించిన క్యాలెండర్ ‌ను ఎస్సీఈఆర్టీ ఇప్పటికే ప్రకటించింది. పదో తరగతి విద్యార్థులు రోజూ తరగతులకు హాజరుకావాలని, ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో 7, 9వ తరగతి విద్యార్థులు, మంగళ, గురు, శనివారాల్లో 6, 8 తరగతుల విద్యార్థులు .. గతంలో మాదిరిగానే తరగతులకు హాజరు కావాలని సూచించింది. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు స్కూళ్లు నడపాలని సూచించింది. మధ్యాహ్నం నుంచి ఆన్‌ లైన్ లో పాఠాలు బోధించాలని ఎస్సీఈఆర్టీ ఆదేశించింది. ఈరోజు నుంచి ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ తరగతులు కూడా మొదలయ్యాయి. కాలేజీల విషయంలో మొత్తం వర్కింగ్ డేస్ ను 106కు తగ్గించారు. ప్రైమరీ సెక్షన్ పై మాత్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో.. ఈ ఏడాదికి ఇక చిన్న పిల్లలకు స్కూళ్లు లేవనే విషయం అర్థమవుతోంది. 1నుంచి 5 వరకు అందరినీ పై తరగతులకు నేరుగా ప్రమోట్ చేస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: