ఇంటి అడ్రస్ రాయాలంటే.. సన్నాఫ్, కేరాఫ్, నియర్ బై, హౌస్ నెంబర్, స్ట్రీట్ నెంబర్, కాలనీ.. ఇలా అన్నీ నింపాల్సి ఉంటుంది. ఉత్తరాలైనా, ఉద్యోగ ప్రయత్నాలైనా ఇది తప్పనిసరి. ఇకపై ఇలాంటి అడ్రస్ లు మాయం అయిపోతున్నాయి. వీటి స్థానంలో క్యూఆర్ కోడ్ లు రాబోతున్నాయి. ఇంటింటికీ క్యూఆర్ కోడ్ అనే ప్రణాళికను తెలంగాణలో ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు. ఇకపై మీ ఇంటి అడ్రస్ చెప్పండి అనే బదులు, మీ అడ్రస్ క్యూఆర్ కోడ్ పంపించండి అని అడగాలన్నమాట.

క్విక్ రెస్పాన్స్ కోడ్ షార్ట్ కట్ లో క్యూఆర్ కోడ్. డిజిటల్ విప్లవంలో దీని పాత్ర చాలా గొప్పది. బ్యాంక్ డిటెయిల్స్ అయినా, వెబ్ పేజీ షార్ట్ కట్ అయినా... సింపుల్ గా క్యూఆర్ కోడ్ రూపంలో పొందుపరిచే అవకాశం ఉంది. డిజిటల్ పేమెంట్లలో క్యూఆర్ కోడ్ అనేది చాలా కీలకంగా మారింది. ఈ దశలో ఇంటి అడ్రస్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో వస్తే.. ఇంటికి వచ్చే వారికి క్యూఆర్ కోడ్ మెసేజ్ చేస్తే.. దాన్ని గూగుల్ లొకేషన్ తో పంచుకుంటే, అడ్రస్ కోసం వెతుక్కోకుండా నేరుగా ఇంటి ముందు ల్యాండయిపోయే అవకాశం ఉంది. అందుకే దీన్ని తెరపైకి తెస్తున్నారు.

జీహెచ్‌ఎంసీతో సహా తెలంగాణలోని అన్ని పురపాలక ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ క్యూఆర్‌ కోడ్ ‌తో కూడిన డిజిటల్‌ డోర్‌ నంబర్లను ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ సన్నాహాలు చేస్తోంది. తొలుత ప్రయోగాత్మకంగా చిన్న పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్ తెలిపారు. ‌తెలంగాణ మున్సిపల్‌ డెవలప్ ‌మెంట్‌ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. ఏపీతో సహా వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. క్యూఆర్‌ కోడ్‌ లో ఇంటి డోర్‌ నంబర్లు, వీధి, నగరం, రాష్ట్రం, పోస్టల్‌ పిన్‌కోడ్, గూగుల్‌ మ్యాప్‌ లొకేషన్‌ యూఆర్‌ఎల్‌ లింక్‌ వంటి సమాచారాన్ని నిక్షిప్తం చేయబోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: