తెలంగాణ రాజ‌కీయాల్లో త‌న‌కంటూ.. ప్ర‌త్యేక ముద్ర వేసుకున్న యువ నాయ‌కుడు, సీఎం త‌న‌యుడు కేటీఆర్ సొంత నియోజ‌క‌వ‌ర్గం సిరిసిల్ల‌లో వ్య‌తిరేక‌త మొద‌లైంద‌నే వార్త‌లు రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గ్రూపు త‌గాదాలు పెరిగిపోయాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సార్లుగా గెలుస్తోన్న కేటీఆర్‌కు సిరిసిల్ల‌లో తిరుగులేద‌నే విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్పుడు మాత్రం ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకున్న‌ట్టు స‌మ‌చారం. అనేక కార‌ణాల‌తో పాటు స్థానిక ప‌రిస్థితులు కేటీఆర్‌కు వ్య‌తిరేకంగా మారుతున్నాయ‌ట‌. ఈ క్ర‌మంలో హుటాహుటిన రంగంలోకి దిగిన కేటీఆర్‌.. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేంకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు.

నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌కంగా ఉన్న ఇద్ద‌రు నాయ‌కులు తోట ఆగయ్య, కొండూరు రవీందర్‌రావు మధ్య వ‌ర్గ పోరు మొదలైంది. పార్టీ‌లో మొదటి నుంచి ఉన్నవారిని కాకుండా కాంగ్రెస్‌ నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని కొన్నాళ్లుగా నేత‌లు రుస‌రుస‌లాడుతున్నారు. ఈ క్ర‌మంలోనే కేటీఆర్ నేరుగా ఆయా విష‌యాల‌పై చ‌ర్చించ‌క‌పోయినా.. నేత‌ల‌ను స‌ర్ది చెప్పేందుకు మాత్రం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అభివృద్ధిపై దృష్టి పెట్టారు. మండ‌లాల్లో చేయాల్సిన అభివృద్ధిపై స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ అంద‌రినీ క‌లుపుకొని పోయేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

కానీ, వ‌ర్గ పోరు విష‌యంలో నేత‌ల మ‌ధ్య తీవ్ర విభేదాలు ఉన్న‌ప్ప‌టికీ.. ఎవ‌రూ కూడా నోరు విప్పి చెప్ప‌డం లేదు. చాలా మంది నేత‌ల‌కు  కొండూరు రవీందర్‌రావుపైనే అసంతృప్తి ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపి స్తున్నాయి. మధ్యలో పార్టీలోకి వచ్చిన ఆయన.. పార్టీలో ఎప్ప‌టి నుంచో ఉన్న‌వారిపై పెత్త‌నం చేస్తున్నా ర‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. దీంతో పార్టీలో విభేదాలు తార‌స్థాయికి చేరుకున్నాయి. ఈ క్ర‌మంలో ఈ విష‌యాన్ని ఎలాగైనా స‌ర్ది చెప్పాల‌ని భావించిన కేటీఆర్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

నాయ‌కులు అంద‌రి తోనూ ఆయ‌న స‌మావేశాలు పెడుతున్నారు. వారి వాద‌న‌ల‌ను ఓపిక‌గా వింటున్నారు. అయితే.. ఎవ‌రికీ ఎలాంటి హామీ ఇవ్వ‌డం లేదు.  కానీ.. క‌లిసి మెలిసి ప‌నిచేయాల‌ని మాత్రం చెబుతున్నారు. దీంతో ప్ర‌స్తుతానికి కేటీఆర్ వ్యూహం ఫ‌లిస్తోంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.  

మరింత సమాచారం తెలుసుకోండి: