విద్యా వ్యవస్థలోనే సంచలన నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధపడింది. దేశంలో ఇతర ఏ రాష్ట్రాలలో లేని విధంగా.. తొలిసారిగా తెలంగాణలో పీజీ వరకు ఉచిత విద్య పథకాన్ని ప్రారంభించబోతున్నారు. హాస్టల్ వసతితో ఐదో తరగతి నుంచి పీజీ కోర్సు పూర్తయ్యే వరకు విద్యార్థులు ఉచితంగా చదువుకునే అవకాశం కల్పిస్తోంది. రాష్ట్రంలోని గురుకులాల్లో పీజీ కోర్సులను కూడా ప్రవేశ పెట్టబోతోంది తెలంగాణ సర్కార్.

గతంలో ఇంటర్మీడియట్‌ వరకే గురుకుల పాఠశాలలు పరిమితం అయ్యేవి. మూడేళ్ల క్రితం వీటిలో డిగ్రీ కోర్సులు కూడా ప్రవేశ పెట్టారు. తాజాగా పీజీ కోర్సులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు అధికారులు. గురుకులాల్లో ఐదో తరగతిలో అడుగుపెట్టే పిల్లలు, పైసా కట్టనవసరం లేకుండా, ప్రతిభ ఆధారంగా ఉచిత వసతితో పీజీ కోర్సులు చదివేందుకు గురుకులాలు అవకాశం కల్పిస్తున్నాయి. 2020-21 నుంచి ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని కళాశాలల్లో పీజీ, ప్రొఫెషనల్‌ కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) అనుమతించింది. అయితే వీటిలో కనీస వసతి, మౌలిక సౌకర్యాలు ఉండాలనే నిబంధన పెట్టింది. ఈ ఏడాదికి దక్షిణ తెలంగాణలో ప్రారంభించి, తర్వాత ఉత్తర తెలంగాణ పరిధిలోని కొన్ని గురుకులాల్లో పీజీ కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఉమ్మడి పీజీ ప్రవేశపరీక్ష లో సాధించే ర్యాంకుల ఆధారంగా వీటిలో సీట్లు భర్తీ చేస్తారు. ఈ ఏడాది నుంచి తొలిసారిగా న్యాయవిద్య కోర్సు కూడా ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 30 డిగ్రీ కాలేజీలు, ఎస్టీ సొసైటీ పరిధిలో 22 కాలేజీలు, బీసీ సొసైటీ పరిధిలో ఒక డిగ్రీ కళాశాల ఉన్నాయి. బీసీ సొసైటీ పరిధిలో కళాశాలల సంఖ్య పెంచాలన్న ప్రతిపాదన ఇంకా అమలుకి నోచుకోలేదు. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల పరిధిలోని డిగ్రీ కాలేజీలను పీజీ, ప్రొఫెషనల్‌ కళాశాలల స్థాయికి చేర్చబోతున్నారు. ఇంజినీరింగ్‌, నర్సింగ్‌, పీజీ, లా, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల కోసం ప్రత్యేక కళాశాలలు స్థాపించబోతున్నారు. ఈ విధానంలో ఇందులో భాగంగా ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఐదు కోర్సులు ప్రవేశపెట్టి 260 సీట్లు అందుబాటులోకి తెచ్చారు. మొత్తమ్మీద తెలంగాణ విద్యా వ్యవస్థలోనే ఇదో పెను మార్పుగా చెప్పుకోవచ్చు. హాస్టల్ వసతి లేక చాలామంది పేద విద్యార్థులు డిగ్రీతోనే చదువుని ఆపేస్తుంటారు. అలాంటి వారందిరికీ గురుకులాలలో పీజీ కోర్సులు బాగా ఉపయోగపడే అవకాశముంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: