విద్యా సంస్థ‌ల పునఃప్రారంభానికి ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్ర‌భుత్వం తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఏపీలోని ఇంటర్మీడియట్ కాలేజీలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ విద్యాశాఖ‌ ఆదేశాలు జారీ చేసింది.  అదే విధంగా పదో తరగతి విద్యార్థులకు నేటి నుంచి రెండు పూటలా తరగతులు జరగనున్నాయి. వీరికోసం ప్రత్యేంగా 103 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. 10వ తరగతి విద్యార్థులకు రోజుకు 8 పీరియడ్లు నిర్వహిస్తారు. ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4.20గంటల వరకూ తరగతులు జరుగుతాయి.  ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం అడ్మిషన్లకు నిన్నటి వరకు అవకాశం ఇచ్చిన ఇంటర్‌ బోర్డు.. పని దినాలను 106 రోజులకు కుదిస్తూ అకడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేసింది.


సిలబస్‌ పూర్తి చేయడం, పరీక్షలు నిర్వహించేందుకుగాను రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ కాలేజీలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 31 వరకూ తరగతులు జరుగుతాయని, రెండో శనివారాలు కూడా కాలేజీలు కొనసాగుతాయని పేర్కొంది. 30 శాతం సిలబస్‌ను తగ్గించింది. పరీక్షలు మేలో జరుగుతాయని స్పష్టం చేసింది. 2021-22 విద్యా సంవత్సరంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూన్‌ 3 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఇంటర్‌ బోర్డు తెలిపింది.


ఇదిలా ఉండ‌గా కరోనా తగ్గుముఖం పట్టిన దృష్ట్యా  విద్యా సంస్థలను ఫిబ్ర వరి ఒకటో తేదీ నుంచి తెరువాలని తెలంగాణ ప్ర‌భుత్వం సైతం నిర్ణయించింది. ఈ ఏడాది జిల్లాలో ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ బోధన సాగుతుండగా, విద్యార్థులంతా ఇంటికే పరిమితమయ్యారు. జిల్లాలో 130 ప్రభు త్వ, కేజీబీవీ, మోడల్‌ పాఠశాలలు ఉన్నాయి. తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు 37 రెసిడెన్సియల్స్‌తో పాటు ఆశ్రమ పాఠశాలలు కలిపి 167 ఉన్నాయి. సర్కారు మార్గదర్శకాల మేరకు వాటిని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొమ్మిది నుంచి 12వ తరగతి వరకు 7967 మంది బాలురు, 9381 మంది బాలికలు ఉండగా వారంతా బడి మెట్లు ఎక్కనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: