వెండితెరపై అందాల రాముడైనా ... కొంటె కృష్ణుడైనా ..ఏడుకొండల వాడైనా..ఇలా ఏ పాత్రయినా ఆయన చేస్తేనే ఆ పాత్రకు నిండుదనం వస్తుంది. కేవలం పౌరాణిక పాత్రలే కాదు.. సాంఘిక, జానపద, చారిత్రక సినిమాలేవైనా.. అతను నటిస్తే ఆ పాత్ర పరిపూర్ణమవుతుంది. తెలుగు సినీ చరిత్రలో సాటిలేని కథానాయకుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. అతనే విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు. అభిమానులు షార్ట్ అండ్ స్వీట్ గా ఎన్టీఆర్ పిలుచుకుంటారు. నేడు ఆయన 25వ వర్థంతి. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు లక్ష్మీ పార్వతి తదితరులు ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు. బాలకృష్ణ, లక్ష్మీ పార్వతి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించి, నివాళి అర్పించారు.

నందమూరి తారకరామారావు ట్రెండ్ సెట్టర్‌గా అభివర్ణించారు నందమూరి బాలకృష్ణ.ఎన్టీఆర్‌ గురించి తప్పుగా మాట్లాడితే సూర్యున్ని వేలితో చూపించడమే అవుతుందన్నారు.. ఎటువంటి పరిస్థితులకు వెదరని బెదరని మనిషి ఎన్టీఆర్ అన్న బాలయ్య.. ఆయన యుగ పురుషుడు.. ఆయన జీవితం మనందరికి ఓ పాఠ్యాంశం అన్నారు. ఎన్టీఆర్ పుట్టినాకే ఆవేశం పుట్టిందన్నారు బాలయ్య.. ఎంతో మంది ఆధ్యాత్మికం కోసమే కాదు.. సమాజం కోసం కూడా పోరాటం చేశారు.. ప్రపంచంలో ఎవరూ చేయలేని పాత్రలు ఎన్టీఆర్ మాత్రమే చేశారన్నారు.పుట్టిన ప్రతి ఒక్కడూ మహానుభావులు కాలేరని, ఎన్టీఆర్ అలాంటి ఘనతను సాధించిన యుగ పురుషుడని చెప్పారు.

 అకుంఠితదీక్షతో ఎలాంటి కార్యాన్నయినా సాధించవచ్చని చేతలతో నిరూపించారని చెప్పారు. అత్యున్నత వ్యక్తిత్వం, అదే స్థాయిలో నైతిక విలువలతో కూడిన రాజకీయాలకు ఎన్టీ రామారావు చిరునామాగా నిలిచారని, దేశ చరిత్రలో చిరస్మరణీయుడని అన్నారు.రాజకీయాలకు నూతన నిర్వచనం ఇచ్చి, కోట్లాది జీవితాలలో వెలుగు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు. బడుగు బలహీనవర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాదిగా ఆయనను అభివర్ణించారు.ఆయన దూరమై 25 సంవత్సరాలు అయినప్పటికీ కళ్ళముందే కదలాడుతున్నట్టు ఉందని అన్నారు.. తెలుగునాట రామరాజ్యాన్ని తిరిగి నెలకొల్పడమే ఎన్టీఆర్‌కు మనం అందించే అసలైన నివాళి అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: