ఏపీలో విప‌క్ష టీడీపీ ప‌రిస్థితి ఎంత ఘోరంగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పవ‌ల‌సిన అవ‌స‌రం లేదు. ఆ పార్టీకి చెందిన నేత‌లు, ఎమ్మెల్యేలు ఇత‌ర పార్టీల్లోకి చెక్కేస్తున్నారు. అయితే 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ త‌ర్వాత టీడీపీలోకి జంప్ చేసిన ఆ నేత‌.. ఎన్నిక‌ల‌కు ముందు తిరిగి వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్నా ప్ర‌యార్టీ లేక ఇప్పుడు తిరిగి టీడీపీలోకి రివ‌ర్స్ జంప్ చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ఆ నేత ఎవ‌రో కాదు ప్ర‌కాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పాల‌ప‌ర్తి డేవిడ్ రాజు. డేవిడ్ రాజు ప్ర‌స్థానం టీడీపీలో ఓ వెలుగు వెలిగింది.

జ‌డ్పీచైర్మ‌న్‌గా ప‌నిచేసిన ఆయ‌న ఆ త‌ర్వాత టీడీపీ నుంచి సంత‌నూత‌ల‌పాడు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీతో విబేధించిన ఆయ‌న వైసీపీలోకి జంప్ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న య‌ర్ర‌గొండ‌పాలెం నుంచి వైసీపీ త‌ర‌పున పోటీ చేసి బారీ మెజార్టీతో టీడీపీ అభ్య‌ర్థి బుడాల అజితారావు ను ఓడించారు. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు డేవిడ్ రాజును ప‌క్క‌న పెట్టేసి తిరిగి అజితారావుకే సీటు ఇచ్చారు. దీంతో ఆయ‌న తిరిగి వైసీపీలోకి వెళ్లారు.

ఇప్పుడు పార్టీ అధికారంలోకి వ‌చ్చినా ఆయ‌న్ను ప‌ట్టించుకునే వాళ్లే లేరు. దీంతో ఆయ‌న తిరిగి త‌న పాత పార్టీ అయిన టీడీపీలో చేరేందుకు రెడీ అవుతోన్న‌ట్టు తెలుస్తోంది. చంద్రబాబు సమయమిస్తే తిరిగి తాను పార్టీలో చేరతానని చెప్పిన డేవిడ్ రాజు... ఏపీలో పరిస్థితులు ఏమాత్రం బాగాలేవని అన్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏపీని అభివృద్ధి బాట ప‌ట్టించాలంటే అది చంద్ర‌బాబు వ‌ల్లే సాధ్య‌మ‌ని చెప్పిన డేవిడ్ రాజు... ఆయ‌న నాయకత్వంపై తనకు నమ్మకం ఉందని తెలిపారు.

ఈ క్ర‌మంలోనే డేవిడ్ రాజు ప్ర‌కాశం జిల్లా ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామ‌చ‌ర్ల జ‌నార్థ‌న్‌తో భేటీ అయ్యారు. త‌న వ‌ల్ల కొన్ని పొర‌పాట్లు జ‌రిగాయ‌ని. వాటిని స‌రిదిద్దుకునే క్ర‌మంలోనే తాను తిరిగి టీడీపీలో చేరుతున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. ఇక త‌న‌తో పాటు త‌న వార‌సుడు సైతం టీడీపీలో చేరతారని ఆయన స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: