ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ వర్ధంతి. ఈ సంధర్భంగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు టీడీపీ నేతలు. అయితే ఈరోజే ఆయనకు అవమానం జరిగింది. కర్నూలులో ఎన్టీఆర్ విగ్రహం ముందు గుర్తు తెలియని వ్యక్తులు చెత్త, మద్యం సీసాలు వేసినట్టు చెబుతున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా పూలమాల వేసేందుకు వెళ్లిన టీడీపీ నేతలకు మద్యం సీసాలు, చెత్త కనిపించడంతో వారు ఆందోళనకు దిగారు. టీడీపీ నేతలు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టిజి భరత్ ఆందోళనకు దిగినట్టు చెబుతున్నారు. ఇక ఎన్టీఆర్ ఘాట్ లో తన  తండ్రికి నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. 


ఎందరో పుడతారు కానీ.. మహానుభావులు కొందరేనని బాలకృష్ణ అన్నారు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప నటుడు ఎన్టీఆర్ అని పేర్కొన్న ఆయన ఎన్టీఆర్ అందగాడు.. గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తి అని అన్నారు. తన పరిపాలనలో ఎన్టీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని, హిందుపురం నియోజకవర్గంలో తాగు సాగు నీరుకు కారణం ఎన్టీఆర్  పథకాలేనని అన్నారు. తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు ఎన్టీఆర్ మానసపుత్రికలని ఆయన అన్నారు. నాకు నిరుత్సాహం కలిగినప్పుడు ఎన్టీఆర్ పేరు స్మరించుకుంటే ఆవేశం, ఉత్సాహం వస్తుందని ఆయన అన్నారు. 


మరో పక్క ఎన్టీఆర్ ఘాట్ లో  టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ , ఎల్. రమణ, రావుల, కంభంపాటి  తదితరులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఎన్టీఆర్ ఘాట్ ను కూల్చాలన్న వ్యాఖ్యలపై స్పందించారు. ఎన్టీఆర్ ఘాట్ ను కూల్చటమంటే మన సంస్కృతిని మనం‌ కూల్చుకోవటమే అని ఆయన అన్నారు. కూల్చటం వంటి పిచ్చి ఆలోచనలు మానుకోవాలని ఆయన అన్నారు. ఎన్టీఆర్ పేరు చెబితే శత్రువుల గుండెల్లో రైళ్ళు పరుగెడతాయన్న బాబు ఎన్టీఆర్ కు భారతరత్న ఆలస్యమైన మాట వాస్తవమె కానీ ఎన్టీఆర్ శత జయంతి రాబోతోంది. అప్పటిలోగా భారతరత్న సాధిస్తామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: