తమిళనాట రజనీకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. సూపర్ స్టార్ కనుసైగ చేస్తే చాలు.. ఏ పనైనా చేసేస్తారు. ఇలాంటి వారంతా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని పార్టీ పెడతారని ఎంతగానో ఎదురుచూశారు. కానీఅనారోగ్య కారణంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇదే విషయాన్ని చెబుతూ ట్విట్టర్ వేదికగా ఓ లెటర్ ను కూడా పోస్ట్ చేశారు. నూతన పార్టీ ఆలోచనకు తాత్కాలిక విరామం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పట్లో పార్టీ ప్రకటన లేదని తప్పకుండా రాజకీయాల్లోకి మాత్రం వస్తానని.. కానీ ఇప్పుడు కాదని తేల్చి చెప్పేశారు.దీంతో రజినీ అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డారు. అభిమానులు ధర్నాలు చేసినా ససేమిరా అని తేల్చి చెప్పడంతో గూడు చెదిరిన పక్షుల్లా తలో దిక్కుకు వెళ్లిపోతున్నారు.

 రజనీ మక్కల్‌ మండ్రంకు చెందిన మూడు జిల్లాల కార్యదర్శులు  ఆదివారం డీఎంకేలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌ సమక్షంలో డీఎంకే కండువా కప్పుకున్నారు. త్వరలో మరి కొందరు మక్కల్‌ మండ్రం నుంచి బయటకు రాబోతున్నట్టు ఈ కార్యదర్శులు ప్రకటించారు.కృష్ణగిరి రజనీ మక్కల్ మండ్రం కార్యదర్శి మది అళగన్ శుక్రవారమే డీఎంకేలో చేరారు.నిన్న డీఎంకేలో చేరిన మక్కల్ మండ్రం నేతల్లో తూత్తుకుడి జిల్లా కార్యదర్శి జోసఫ్ స్టాలిన్, రామనాథపురం కార్యదర్శి సెంథిల్ సెల్వానంద్, తేని కార్యదర్శి గణేశన్ ఉన్నారు. వీరంతా తమ మద్దతుదారులతో కలిసి డీఎంకేలో చేరారు.

రాజకీయాల్లో రజనీ వెంట నడిచే అవకాశం లేకపోవడంతో.. తమ పొలిటికల్ జర్నీని వేరే పార్టీల్లో స్టార్ట్ చేయాలని చూస్తున్నారు పలువురు ఫ్యాన్స్.తాము డీఎంకేలో చేరబోతున్నట్టుగా రజనీ మక్కల్ మండ్రం పెద్దలతో చెప్పే వచ్చినట్టు ఆ మూడు జిల్లాల కార్యదర్శులు స్పష్టం చేశారు. తమ అభిమాన నాయ కుడు రజనీ రాజకీయాల్లోకి వస్తారని ఎదురుచూశామని అయితే.. ఆయన ఆరోగ్య సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. రాజకీయ పయనం రజనీతో సాధ్యం కాదని తేలడంతో డీఎంకేలోకి చేరామని వారు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: