తెలంగాణాలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్ననేపథ్యలో కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాదాద్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్ గెలవకపోతే రాజకీయాలు గురించి మాట్లాడనని తేల్చి చెప్పారు. నాగార్జునసాగర్ లో జానారెడ్డి గెలుపు ఖాయమని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఐకేపీ సెంటర్లు బంద్ పెడితే టిఆర్ఎస్ ఎంపీ, మంత్రులు ఎమ్మెల్యేలను రైతులు ఉరికించి కొడతారని కోమటిరెడ్డి హెచ్చరించారు.
                      రైతు చట్టాలకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కేసీఆర్ అవినీతి పై బీజేపీ రాజీపడ్డా తాము వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఉంటున్న కేసీఆర్ స్వగ్రామం చింతమడక వాసులకు డబ్బులు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని  కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. కానీ, యాదగిరిగుట్టలో షాపులు, ఇండ్లు కోల్పోయిన వారికి డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నాగార్జునసాగర్ లో ఎన్నికలు వస్తున్నాయి అంటే అక్కడ నిధులు మంజూరు చేస్తున్నారంటూ కోమటిరెడ్డి ఆరోపించారు.
                                గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో మత రాజకీయాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడిందని.. అందుకే సరైన ఫలితాలు పొందలేకపోయిందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క వైపు చేస్తూ.. మరో వైపు పోరాటాలు చేస్తున్నామన్న కోమటిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడా..? లేడా ? అంటూ ఆయన మండిపడ్డారు. ఇక, యాదగిరిగుట్టలో తన ఫామ్ హౌస్‌ రోడ్డు కోసం ఇళ్లు కోల్పోయిన బాధితులకు అన్యాయం చేశారంటూ కోమటిరెడ్డి మండిపడ్డారు. మూడేళ్ల నుండి డీఎస్సీ నోటిఫికేషన్‌ లేక నాలుగు వేల పాఠశాలలు మూతపడ్డాయని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆయన దుయ్యబట్టారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆత్మహత్యలకు కారణం సీఎం కేసీఆరేనని కోమటిరెడ్డి ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: